కొనసాగుతున్న బంగాల్‌, అసోం తొలిదశ పోలింగ్‌

 దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్న బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. బంగాల్‌ శాసనసభలో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా... తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది.

Updated : 27 Mar 2021 09:28 IST

దిల్లీ: దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్న బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. బంగాల్‌ శాసనసభలో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా... తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 30 స్థానాల్లో మొత్తం 191 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. బంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్నారు.  తొలి విడత పోలింగ్‌ కోసం 10,288 పోలింగ్‌ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.  ఆదివాసీలు ఎక్కువగా నివసించే పురులియా, బంకురా, ఝార్‌గ్రాం, తూర్పు మేదినీపూర్‌, పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. 

అస్సాంలో త్రిముఖ పోరు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తొలి దశలో ఇవాళ 47 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 264 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సీఎం సర్బానంద సోనోవాల్‌, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రిపున్‌ బోరా, అసోం గణ పరిషద్‌ (ఏజీపీ) అధ్యక్షుడు అతుల్‌ బోరా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశబ్‌ మహంత, అసోం జాతీయ పరిషద్‌ (ఏజేపీ) అధ్యక్షుడు లురిజ్యోతి గొగొయ్‌, రైజొర్‌ దళ్‌ అధ్యక్షుడు అఖిల్‌ గొగొయ్‌ తదితర ప్రముఖులు మొదటి దశ ఎన్నికల్లోనే బరిలో ఉన్నారు. పలు స్థానాల్లో అధికార భాజపా-ఏజీపీ కూటమి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాజోత్‌ కూటమి, ఏజేపీ-రైజొర్‌దళ్‌ కూటమి మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. తొలి దశ పోలింగ్‌ జరగనున్న స్థానాల్లో  81.09 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.   

యువనేస్తాలూ.. ఓటింగ్‌లో పాల్గొనండి: మోదీ

ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ వినియోగించుకుని తమ బాధ్యతను నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్‌, అసోం తొలి దశ ఎన్నికల సందర్భంగా.. ఆయన ఈ మేరకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘అసోం, బెంగాల్‌లో అసెంబ్లీకి తొలి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటరుగా గుర్తింపు పొందిన వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ బాధ్యత నిర్వర్తించాలి. ప్రధానంగా నా యువ నేస్తాలను ఓటింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నా’ అని మోదీ ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.  



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని