Offbeat: మధ్యప్రదేశ్‌ పోలీసులకు వింత కేసు.. గేదె పాలివ్వడం లేదంటూ ఫిర్యాదు!

మధ్యప్రదేశ్‌లోని బింధ్‌ జిల్లా నాయ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌ను ఓ వింత కేసు తలుపు తట్టింది. తన గేదె పాలివ్వడం లేదంటూ ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు.

Published : 14 Nov 2021 19:51 IST

భోపాల్‌: పొరుగు రైతు దాడి చేశాడనో.. భూమి ఆక్రమించుకున్నాడనో కేసులు పెడుతుంటారు గ్రామస్థులు. మరికొందరైతే పక్కింటి వాళ్లు తిట్టారనో.. ఎదురింటి వారు దూషించారనో చిన్న చిన్న విషయాలకూ పోలీసులను ఆశ్రయిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని బింధ్‌ జిల్లా నాయ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌ను ఓ వింత కేసు తలుపు తట్టింది. తన గేదె పాలివ్వడం లేదంటూ ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. నేరుగా గేదెను తోలుకొచ్చి ఫిర్యాదు చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్లితే..

బాబూ లాల్‌ జాతవ్‌ (45) అనే రైతు శనివారం నాయ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. కొద్దిరోజులుగా తన గేదె పాలివ్వడం లేదని తెలిపాడు. బహుశా ఎవరైనా చేతబడి చేసి ఉంటారని గ్రామస్థులు చెప్పడంతో అతడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. మళ్లీ ఓ 4 గంటల తర్వాత వచ్చి ఈ విషయంలో ఏదైనా సాయం చేయాలని పోలీసులను కోరాడట. దీంతో పశువైద్యుడిని సంప్రదించాలని అతడికి నచ్చజెప్పి పంపినట్లు డీఎస్పీ అరవింద్‌ షా తెలిపారు. మళ్లీ ఆదివారం ఉదయం ఆ రైతు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన గేదె పాలిస్తోందని సంతోషం వ్యక్తంచేశాడని, పోలీసులకు ధన్యవాదాలు కూడా చెప్పాడని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని