Published : 04/06/2021 21:44 IST

Mystery UFOs: ఏలియన్స్‌ పనేనా.. లేదా..?

గ్రహాంతరవాసులపై త్వరలో అమెరికా ప్రభుత్వం నివేదిక

వాషింగ్టన్‌: అమెరికాలో గుర్తించిన కొన్ని రకాల ఫ్లయింగ్‌ సాసర్లు గ్రహాంతరవాసులవి అనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని అమెరికా అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ మిస్టరీ వ్యోమనౌకలు మాత్రం ఎవరివనే విషయాన్ని తేల్చలేకపోయినట్లు సమాచారం. అన్‌-ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌(యూఎఫ్‌వో)లకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని వెల్లడించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలను ఆ దేశ మీడియా వెల్లడించింది.

చారిత్రాత్మక నివేదిక..

వాతావరణంలో కొన్ని గుర్తుతెలియని వస్తువులకు సంబంధించిన ఘటనలపై దర్యాప్తు చేసేందుకు అమెరికా ఇప్పటికే ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ నెల 25న తన నివేదికను వెలువరించే అవకాశం ఉంది. అయితే, మిస్టరీ వస్తువులకు సంబంధించి ఇప్పటివరకు తనకు తెలిసిన విషయాలపై అమెరికా ప్రభుత్వం తొలిసారి నివేదిక విడుదల చేయడానికి సిద్ధమవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నివేదిక గురించి కొన్ని విషయాలను ఓ సీనియర్‌ అధికారి ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’తో పంచుకున్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కనిపించిన వస్తువులు పెంటగాన్‌ రహస్య సాంకేతిక విభాగానికి చెందినవి కావని నిర్ధారించామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను గ్రహాంతరవాసులు (ఏలియన్స్‌) చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, వాటిని కొట్టిపారేయలేమని చెప్పారు. దీంతో ఈ ఘటనలకు గ్రహాంతరవాసులే కారణమనే ఊహాగానాలకు మరోసారి ఆజ్యం పోసినట్లేనని తెలుస్తోంది.

చైనా, రష్యాలపై అనుమానాలు!

అమెరికాలో వెలుగుచూస్తోన్న ఇటువంటి ఘటనల వెనుక చైనా, రష్యా దేశాల హస్తం ఉందా? అన్న కోణంలోనూ అమెరికా రక్షణశాఖలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైపర్‌సోనిక్‌ సాంకేతికత సహాయంతో చైనా లేదా రష్యా ప్రయోగాలు చేసి ఉండొచ్చని అమెరికా నిఘా విభాగంతో పాటు సైన్యం భావిస్తున్నట్లు నివేదికపై స్పందించిన మరో అధికారి పేర్కొన్నారు. ఇలా గ్రహాంతరవాసులపై భిన్న కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అమెరికా సైన్యం మాత్రం ఇటువంటి ఘటనలను యూఎఫ్‌వోలు అని కాకుండా కేవలం గుర్తించబడని వైమానిక దృగ్విషయం(అన్‌-ఐడెంటిఫైడ్‌ ఏరియల్‌ ఫినామినా)గా మాత్రమే పేర్కొంటోంది.

గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న ‘ఫ్లయింగ్‌ సాసర్లు’ భూమిని సందర్శించి వెళుతున్నట్లు కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. గడిచిన రెండు దశాబ్దాలుగా దాదాపు 120 ఘటనలు వెలుగుచూసినట్లు సమాచారం. అత్యంత వేగంతో కనిపించి అదృశ్యమయ్యే ఇలాంటి వస్తువులకు సంబంధించిన ఘటనలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. 2019లో అమెరికా యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టిముట్టినట్లు పరిశోధనాత్మక లఘుచిత్రాల దర్శకుడు జెరిమీ కార్బెల్‌ పేర్కొనడం మరోసారి చర్చకు దారితీసింది. రాడార్‌ చిత్రాల్లో కనిపించిన ఆ దృశ్యాలను అమెరికా రక్షణశాఖ కూడా ధ్రువీకరించింది. తాజాగా వీటిపై అమెరికా ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేయనుండడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని