ఆ రైతుల భాగస్వామ్యం లేనిదే వృద్ధి లేదు - మోదీ

చిన్న, సన్నకారు రైతుల భాగస్వామ్యం లేనిదే భారత్‌ వృద్ధి సాధించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 01 Mar 2021 14:26 IST

దిల్లీ: చిన్న, సన్నకారు రైతుల భాగస్వామ్యం లేనిదే భారత్‌ వృద్ధి సాధించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో రైతులు ఆందోళన చేస్తోన్న వేళ, బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులను ఆయన సమర్థించారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కేటాయింపులు, ఆ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ వివరించారు.

చిన్న, మధ్యస్థాయి రైతులు లేకుండా అభివృద్ధిని ఆశించలేమన్న ప్రధాని మోదీ, ఈ-నామ్‌ వ్యవస్థకు దాదాపు 1000కిపైగా మండీలను అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టంచేశారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులను తమ ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. వ్యవసాయ రుణాల పరిమితిని రూ.16.50లక్షల కోట్లు చేసినట్లు వెల్లడించారు. వీటిలో పాడి పశుసంవర్ధక, పాల, మత్య్స రంగాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. మరో 40వేల కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో మౌలికసదుపాయాల కల్పన కోసం నిధులకు కేటాయించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రైవేటురంగం పాత్రను పెంచే ఆసన్నం..

వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్న మోదీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రెండు, మూడు దశాబ్దాల కిందటే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇక గ్రామాలకు సమీపంలోనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెరగాల్సి ఉందన్నారు. తద్వారా గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడే అవకాశం లభిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా, వ్యవసాయ రంగం పరిశోధనాభివృద్ధిలో ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంచే సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని