ఈ నెల 12 నుంచి నాట్య ‘పరంపర’ వేడుకలు

భారత సంస్కృతీ నాట్యకళా సౌరభాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘నాట్యతరంగణి’ కళా సంస్థ మరోసారి సిద్ధమైంది. నవంబరు 12వ తేదీ నుంచి 14 వరకు తిరిగి 19 నుంచి 24 తేదీ వరకు ‘ పరంపర’ పేరుతో సాంస్కృతిక నృత్య కచేరీలను నిర్వహించనుంది...

Published : 09 Nov 2021 21:18 IST

దిల్లీ: భారత సంస్కృతీ నాట్యకళా సౌరభాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘నాట్యతరంగణి’ కళా సంస్థ మరోసారి సిద్ధమైంది. నవంబరు 12 నుంచి 14 వరకు; 19 నుంచి 24వ తేదీ వరకు ‘పరంపర’ పేరుతో సాంస్కృతిక నృత్య కచేరీలను నిర్వహించనుంది. దేశవిదేశాల్లోనూ ఈ సంస్థకు మంచి పేరుంది. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీతలు రాజా రాధ రెడ్డి, కౌశల్యరెడ్డి సంయుక్తంగా 1976లో ఈ సంస్థను స్థాపించారు. హైదరాబాద్‌, గురుగ్రామ్‌, దిల్లీలో శాఖలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో సంగీతం, నృత్యం ఒక భాగం కావాలనే లక్ష్యంతో ‘పరంపర’ పేరిట జాతీయ, అంతర్జాతీయ సంగీత వేడుకలను నిర్వహిస్తున్నారు. ఓ వైపు స్వతంత్ర భారత్‌ ఆజాదీ అమృత్‌ మహోత్సవాలను నిర్వహిస్తుండగా... 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నాట్యతరంగణి సంస్థ సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ లాంటి ప్రముఖులు గతంలో ‘నాట్య తరంగణి’ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భాలూ ఉన్నాయి. అప్రతిహతంగా కొనసాగుతున్న ‘పరంపర’ సంగీత కార్యక్రమాలకు 2020లో కొవిడ్‌ రూపంలో ఆటంకం ఎదురైంది. ప్రత్యక్ష సంగీత కచేరీలకు అవకాశం లేకపోవడంతో ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఇండియా’తో కలిసి సంయుక్తంగా ఆన్‌లైన్‌లోనే కచేరీలను నిర్వహించారు. అంతేకాకుండా గత 23 ఏళ్లుగా నాట్యతరంగణి చేసిన కార్యక్రమాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి కళా పిపాసులకు ‘నాట్య తరంగణి’ మరింత చేరువైంది. భవిష్యత్‌లోనూ ‘యునైటెడ్‌ నేషన్స్‌’తో కలిసి మరిన్ని ‘పరంపర’ ప్రదర్శనలు చేసేందుకు ‘నాట్యతరంగణి’ సిద్ధమవుతోంది. ఈ ప్రదర్శలను ప్రత్యక్షంగానే కాకుండా సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.

మరోవైపు కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు విధించిన కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి 14 వరకు, తిరిగి 19 నుంచి 21 తేదీ వరకు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ‘నాట్యతరంగణి’ ప్రకటన విడుదల చేసింది. దిల్లీ సాకేత్‌ రోడ్డులోని నాట్యతరంగణి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌కు సమీపంలోని రాజారాధ రంగమంచ్‌ కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతించనున్నారు. వర్చువల్‌ ప్రేక్షకుల కోసం యునైటెడ్‌ నేషన్స్‌తో పాటు రాజారాధ రెడ్డి యూట్యూబ్‌ పేజీలో కార్యక్రమాలను లైవ్‌ స్ట్రీమ్‌ చేయనున్నారు. అంతేకాకుండా  రాజారాధరెడ్డి, నాట్యతరంగణి ఫేస్‌బుక్‌ పేజీలోనూ లైవ్‌స్ట్రీమ్‌ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని