అన్నినగరాల్లో దిల్లీ తరహా ఆందోళనలు: తికాయిత్‌

రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ తరహా ఆందోళనలు దేశంలోని ప్రతినగరంలో చేపట్టాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్‌ తెలిపారు.

Published : 21 Mar 2021 09:38 IST

బెంగళూరు: రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ తరహా ఆందోళనలు దేశంలోని ప్రతినగరంలో చేపట్టాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన కర్ణాటకలోని శివమొగ్గలో శనివారం నిర్వహించిన రైతుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల నుంచి భూమి లాక్కోవడానికి ప్రభుత్వం వ్యూహం రూపొందించిందన్నారు. కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ పోరాటం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

‘దిల్లీలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ పోరాటాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దిల్లీలో మాదిరి ఆందోళనల్ని మనం దేశంలోని ప్రతి నగరంలోనూ చేపట్టాలి. కేంద్రం తెచ్చిన ఈ నల్ల చట్టాలు మనకు కనీస మద్దతు ధర అందించవు. మరోవైపు రైతుల నుంచి భూమి లాక్కోవడానికి వ్యూహం రూపొందించారు. అదేకనుక జరిగితే పెద్ద కంపెనీలు మాత్రమే వ్యవసాయం చేస్తాయి. అందుకు అనుగుణంగా కార్మికులు చౌకగా వచ్చేలా చట్టాలను సైతం సవరించారు. కాబట్టి కర్ణాటకలోనూ రైతులంతా నిరసనలు చేయాల్సిన అవసరం ఉంది. బెంగళూరును మరో దిల్లీలా మర్చాలి. రైతులు తమ ఉత్పత్తుల్ని ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ చెప్పారు. మీరు మీ పంటల్ని తీసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లండి. ఒకవేళ పోలీసులు ఆపితే కనీస మద్దతు ధరకు పంటను కొనమని వారినే తిరిగి అడగండి’ అని తికాయిత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కూడా నిరసనలు చేపట్టాలని తికాయిత్‌ పిలుపునిచ్చారు. ‘రైతుల ఆందోళన జరగకపోతే.. దేశం మొత్తాన్ని అమ్మేస్తారు. 20 ఏళ్ల తర్వాత మీ భూమిని కూడా మీరు కోల్పోతారు. కేంద్రం తీసుకున్న 26 ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కాలి. ఈ కంపెనీల అమ్మకాలకు వ్యతిరేకంగా మనం ప్రతిజ్ఞ చేయాలి. ఆయా సంస్థలను మనం కాపాడాలి’ అని తికాయిత్‌ రైతులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని