Subhas Chandra Bose: ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహం: మోదీ

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయనున్నారు.

Published : 21 Jan 2022 18:46 IST

దిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విగ్రహం సిద్ధమయ్యేవరకు బోస్ హోలోగ్రామ్‌ను ఆ ప్రదేశంలో ఉంచనున్నారు. గతంలో ఇంగ్లండ్ రాజు జార్జ్‌-V విగ్రహం ఉన్న స్థానంలోనే ఇప్పుడు బోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. జార్జ్‌ విగ్రహాన్ని 1968లో అక్కడి నుంచి తరలించారు.

‘దేశమంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరుపుకొంటున్న తరుణంలో ఇండియా గేట్ వద్ద ఆయన గ్రానైట్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆయన రుణం తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం. నేతాజీ భారీ విగ్రహం పూర్తయ్యేవరకు.. ఆయన హోలోగ్రామ్‌ను ఆ స్థానంలో ఉంచనున్నాం. జనవరి 23న దానిని ఆవిష్కరించనున్నాను’ అని మోదీ వరుస ట్వీట్లు చేశారు. బోస్ జయంతిని పురస్కరించుకొని జనవరి 23 నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మామూలుగా అయితే జనవరి 24న ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. హోలోగ్రామ్‌ అంటే కాంతి కిరణాల ద్వారా ఏర్పడే త్రీ డైమెన్షల్ చిత్రం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని