Karnataka:సీఎంగా యడియూరప్పే కొనసాగుతారు 

కొన్ని రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగిస్తారన్న వదంతులు వ్యాపిస్తున్నాయి. యడ్డీ స్థానంలో మరొకరిని నియమిస్తారనే ఊహాగానాలు పార్టీలో అంతర్గతంగా చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటిని ఖండించారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌.

Updated : 29 May 2021 19:17 IST

స్పష్టతనిచ్చిన కర్ణాటక భాజఫా అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌

బెంగళూరు: కొన్ని రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగిస్తారన్న వదంతులు వ్యాపిస్తున్నాయి. యడ్డీ స్థానంలో మరొకరిని నియమిస్తారనే ఊహాగానాలు పార్టీలో అంతర్గతంగా చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నింటిని ఖండించారు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌.  ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ‘‘సీఎం పదవిలో ఎటువంటి మార్పు లేదు. యడియూరప్పే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయనే మా ఏకగ్రీవ నాయకుడు. కేంద్రం సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక మీద దీనిపై ఎలాంటి చర్చ ఉండదు. ఇప్పటివరకూ సీఎంగా రెండేళ్లు పూర్తి చేసుకున్నారాయన. మిగిలిన రెండేళ్లూ ఆయనే కొనసాగి పదవీకాలాన్ని పూర్తి చేస్తారు’’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొవిడ్‌ కట్టడి మినహా ఇతరత్రా ఏ అంశంపైనా చర్చలు నిర్వహించవద్దన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు సేవ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం మార్పు విషయమై కర్ణాటక మంత్రి సీపీ యోగేశ్వర్‌ దిల్లీకి పయనం కావడం, ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అరవింద్‌ మిల్లార్‌, బసన గౌడ.. నాయకత్వ మార్పు కోరుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సీపీ యోగేశ్వర్‌ నుంచి బహిరంగంగా వివరణ కోరనున్నట్లు నళిన్‌ కుమార్‌ చెప్పారు. ఇదిలా ఉండగా గురువారం తన దిల్లీ పర్యటన గురించి స్పష్టతనిచ్చారు యోగేశ్వర్‌. తన రాజకీయ భవిష్యత్తు గురించి పార్టీ పెద్దలతో చర్చించేందుకే తప్ప సీఎం మార్పు గురించి కాదని వివరణ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని