Supreme Court: పరంబీర్‌.. ముందు ఎక్కడున్నారో చెప్పండి.. అప్పుడే విచారిస్తాం..!

బలవంతపు వసూళ్ల కేసులో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన ఎక్కడ

Updated : 18 Nov 2021 16:27 IST

దిల్లీ: బలవంతపు వసూళ్ల కేసులో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ వివరాలు చెప్పేంత వరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని, రక్షణ కల్పించబోమని స్పష్టం చేసింది. 

తనపై నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పరంబీర్‌ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ‘‘మీరు (పరంబీర్‌ను ఉద్దేశిస్తూ) రక్షణ ఉత్తర్వులు కోరుతున్నారు. కానీ, ఎక్కడున్నారనేదీ ఎవరికీ తెలియదు. అటార్నీ పవర్‌తో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. మీరు విదేశాల్లో కూర్చోని.. అటార్నీ అధికారాల ద్వారా చట్టపరమైన సాయం తీసుకుంటున్నారని అనుకుందాం. అదే నిజమైతే కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇస్తేనే భారత్‌కు వస్తారు. మీ మైండ్‌లో ఏముందో ఏమో మాకు తెలియదు. కానీ, మీరు ఎక్కడ ఉన్నారో తెలిసేంత వరకు విచారణ చేపట్టేది లేదు.. రక్షణ కల్పించేది లేదు. అసలు మీరు ఎక్కడున్నారు? ఈ దేశంలోనేనా? దేశం విడిచి వెళ్లిపోయారా? ముందు మీరు ఎక్కడున్నారో తెలిస్తేనే.. మిగతా విషయానికి వస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను నవంబరు 22వ తేదీకి వాయిదా వేసింది. 

రూ.15కోట్ల కోసం పరంబీర్‌, మరో ఐదుగురు పోలీసులు తనను వేధించారంటూ ఈ ఏడాది జులైలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు పరంబీర్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారు. అయితే, అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరిసారిగా మే నెలలో తన కార్యాలయంలో విధులకు వచ్చిన పరంబీర్‌.. ఆ తర్వాత నుంచి కనిపించడంలేదు. ఆయన దేశం విడిచి పారిపోయారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. పరంబీర్‌ను పరారీలో ఉన్న నేరస్థుడిగా బాంబే మెజిస్ట్రేట్‌ కోర్టు బుధవారం ప్రకటించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు