Kim: కిమ్‌ను కాపీ కొడతారా..? లెదర్‌ కోట్‌పై ఉత్తర కొరియా నిషేధం!

ఉత్తర కొరియాలో ఆంక్షలు, నిషేధాల పరంపర కొనసాగుతోంది. ఆహార కొరత దృష్ట్యా ప్రజలు ఆహారం తక్కువ తినాలని ఇటీవల ఆంక్షలు విధించిన ఉత్తర కొరియా.. తాజాగా ప్రజలు లెదర్‌ కోట్‌ ధరించడాన్ని నిషేధించింది. ప్రజలెవరూ లెదర్‌ కోట్‌ ధరించకూడదని, వస్త్ర వ్యాపారాలు

Updated : 27 Nov 2021 12:45 IST

ప్యాంగ్యాంగ్‌: ఉత్తర కొరియాలో ఆంక్షలు, నిషేధాల పరంపర కొనసాగుతోంది. ఆహార కొరత దృష్ట్యా ప్రజలు ఆహారం తక్కువ తినాలని ఇటీవల ఆంక్షలు విధించిన ఉత్తర కొరియా.. తాజాగా ప్రజలు లెదర్‌ కోట్‌ ధరించడాన్ని నిషేధించింది. ప్రజలెవరూ లెదర్‌ కోట్‌ ధరించకూడదని, వస్త్ర వ్యాపారులు వాటిని విక్రయించకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిషేధం వెనుక ఆసక్తికరమైన నేపథ్యముంది. అదేంటంటే.. 2019లో ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌-ఉన్‌ ఖరీదైన లెదర్‌ కోట్‌ను ధరించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ధరించిన లెదర్‌ కోట్‌ బాగా ఆకర్షించడంతో దేశంలో ఉన్న సంపన్నులంతా ఆయనకు మద్దతుగా అలాంటి లెదర్‌ కోటునే ధరించడం మొదలుపెట్టారు. అలా ఆ లెదర్‌ కోట్‌ అధికారులు, సంపన్నుల ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే, సామాన్య ప్రజలు కూడా దానిపై మనసు పారేసుకున్నారు. దీంతో కొందరు వస్త్ర వ్యాపారులు నాసిరకం లెదర్‌ కోట్స్‌ను దిగుమతి చేసుకొని ప్రజలకు అందుబాటు ధరలో విక్రయించడం మొదలు పెట్టారు. ఇంకేముంది ప్రజలు వాటిని కొనుగోలు చేసి ఎంచక్కా తమ దేశాధ్యక్షుడు కిమ్‌ వస్త్రధారణను కాపీ కొడుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో నాసిరకం లెదర్‌ కోట్‌ ధరించి.. కిమ్‌ను, అధికారుల్ని అవమానిస్తున్నారంటూ వాటిపై నిషేధం విధించారు. ఫ్యాషన్‌ పోలీసులను నియమించి.. కోటు ధరించిన వ్యక్తుల్ని, విక్రయిస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకుంటున్నారు. లెదర్‌ కోటే కాదు.. బ్లూ జీన్స్‌, స్కర్ట్స్‌, డిజైన్‌ షూస్‌ తదితర ఫ్యాషన్‌ దుస్తులు కూడా ఆ దేశంలో నిషేధం. పాశ్చాత్యదేశాల ఫ్యాషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కిమ్‌.. తమ దేశ ప్రజలు ఆ పోకడలకు అలవాటు పడకూడదని మొదటినుంచి వీటిపై నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని