Covid: కరోనాతో పేగులకూ ముప్పే!

కరోనా మహమ్మారి ఊపిరితిత్తులు, గుండె, మెదడులాంటి అవయవాలపైనే ప్రభావం చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ వైరస్‌ ప్రభావం పేగులపైన కూడా తీవ్రంగానే పడుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ -19 వల్ల పేగుల్లో పుళ్లు ఏర్పడి, చివరికి కుళ్లిపోయే స్థితికి చేరుకుంటున్నాయని చెబుతున్నారు.

Published : 03 Jun 2021 01:36 IST

ముంబయి: కరోనా మహమ్మారి ఊపిరితిత్తులు, గుండె, మెదడులాంటి అవయవాలపైనే ప్రభావం చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ వైరస్‌ ప్రభావం పేగులపైన కూడా తీవ్రంగానే పడుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ -19 వల్ల పేగుల్లో పుళ్లు ఏర్పడి, చివరికి కుళ్లిపోయే స్థితికి చేరుకుంటున్నాయని చెబుతున్నారు. ముంబయి పరిసరాల్లోని ఆస్పత్రుల్లో పలువురు వైద్యులు జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చేరిన కొందరిలో విపరీతమైన కడుపు నొప్పి రావడాన్ని వైద్యులు గుర్తించారు. స్కాన్‌ చేసి చూస్తే.. వారి పేగుల్లో పుళ్లు ఉన్నాయని తేలింది. కొవిడ్‌ బారిన పడిన 16-30 శాతం మంది బాధితుల్లో ఈ సమస్య తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. బాధితుల పేగుల్లో రక్తం గడ్డలు కడుతోందని, ఫలితంగా పుళ్లు ఏర్పడుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. కడుపునొప్పి భరించలేక కొంతమంది బాధితులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) స్వతంత్ర పరిశోధనకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆసక్తి ఉన్నవారు ఆయా ప్రాంతాల్లో బాధితులను పరిశీలించి, వ్యాధి లక్షణాలపై సాంకేతికంగా పరిశోధన చేసి నివేదికలు సమర్పించవచ్చని తెలిపింది. తద్వారా ప్రదేశాలను బట్టి వైరస్‌ వ్యాప్తి ఎలా ఉంటుందో నిర్ధారించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెబుతోంది. ఈ క్రమంలో పలువురు వైద్యులు తమ దగ్గరికి వచ్చిన బాధితుల్లోని కొత్తలక్షణాలపై పరిశోధనలు చేసి ఐసీఎంఆర్‌కు నివేదికలు ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో తదనుగుణంగా క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొటోకాల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్‌ అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని