Vaccination: అక్కడ రెస్టారెంట్‌, జిమ్‌కు వెళ్లాలంటే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ ఉండాల్సిందే..!

డెల్టా వైరస్‌ విజృంభణతో కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. గతంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలించిన .....

Published : 03 Aug 2021 23:58 IST

త్వరలో న్యూయార్క్‌ నగరంలో అమలు: మేయర్‌ ప్రకటన

న్యూయార్క్‌: డెల్టా వైరస్‌ విజృంభణతో కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. గతంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలించిన ఆంక్షలను మళ్లీ కట్టుదిట్టం చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని న్యూయార్క్‌ నగర మేయర్‌ బిల్‌ డే బ్లాసియో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని రెస్టారెంట్లు, జిమ్‌లు వంటి ఇండోర్‌ కార్యకలాపాల్లో పాల్గొనేవారు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను ఆధారంగా చూపాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే ఈ ఆంక్షలను అమలుచేస్తామని, అగ్రరాజ్యంలో ఈ తరహా ఆంక్షలు అమలుచేసిన తొలి పెద్ద నగరంగా న్యూయార్క్‌ నిలుస్తుందని తెలిపారు.  ‘Key to NYC’ పేరుతో ఆగస్టు 16 నుంచి తొలుత అమలుచేస్తామని, ఆ తర్వాత సెప్టెంబర్‌ 13 నుంచి పూర్తిస్థాయిలో దీన్ని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ప్రజలు ఆరోగ్యకరమైన మంచి జీవితాన్ని కొనసాగించేలా వ్యాక్సినేషన్‌కు ఇదే సరైన సమయమన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే దురదృష్టవశాత్తు అనేక అంశాల్లో భాగస్వాములు కాలేరని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతిఒక్కరూ ఏకీభవించకపోవచ్చని, కానీ వ్యాక్సినేషన్‌ మనిషి జీవితాన్ని కాపాడుతుందన్నారు. న్యూయార్క్‌ నగరంలో దాదాపు 66శాతానికి పైగా వయోజనులకు వ్యాక్సినేషన్‌ పూర్తయినట్టు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని