Omicron: రోగనిరోధక శక్తి తగ్గితే ఒకరి శరీరంలోనే పలు మ్యూటేషన్లు..!

ప్రపంచానికి దక్షిణాఫ్రికా తెలియజేసిన సార్స్‌కోవ్‌-2 ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఓ హెచ్‌ఐవీ పేషెంట్‌ నుంచి వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి.

Updated : 30 Nov 2021 14:13 IST

గతంలోనే గుర్తించిన శాస్త్రవేత్తలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచానికి దక్షిణాఫ్రికా తెలియజేసిన సార్స్‌కోవ్‌-2 ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఓ హెచ్‌ఐవీ పేషెంట్‌ నుంచి వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. హెచ్‌ఐవీ పేషెంట్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారి నుంచి కొత్త మ్యూటేషన్లు రావడం ఇదే తొలిసారి ఏమీ కాదు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇటువంటి పలు రకాల కేసులు వచ్చాయి. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వ్యక్తిలో చాలా కాలం ఇన్ఫెక్షన్‌ కొనసాగితే.. వారిలో వైరస్‌ మ్యూటేషన్లకు దారి తీస్తుందని తేలింది. ఇలాంటి వ్యక్తుల్లో వచ్చే మ్యూటేషన్లకు రోగనిరోధక శక్తిని తప్పుదోవ పట్టించే లేదా యాంటీబాడీస్‌ను తట్టుకొనే లక్షణాలు ఉంటున్నట్లు కూడా అర్థమవుతోంది.

వైరస్‌లు.. జంతువులు, మనుషులకు సోకినప్పుడు విపరీతంగా పునరుత్పత్తి చేస్తాయి. పునరుత్పత్తి సమయంలో జన్యువుల్లో పొరపాట్లతో కొత్తగా పుట్టుకొచ్చే వైరస్‌ల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకొంటాయి. వీటినే మ్యూటేషన్లు అంటారు. మార్పునకు గురైన వైరస్‌ కొత్తరూపాన్ని స్ట్రెయిన్‌ అంటారు. కరోనా వైరస్‌ కూడా చాలా సార్లు మార్పు చెందింది. ప్రస్తుతానికి ఈ మార్పులు వైరస్‌ జన్యు క్రమంలో ఒక శాతంలో పదోవంతు కంటే తక్కువే. ఇవి వేగంగా జరిగితే త్వరలోనే ఈ వైరస్‌ కొత్త జాతిగా మారొచ్చు. ఇక కరోనా వైరస్‌ ఆతిథ్య కణంలోపలే పునరుత్పత్తి అవుతుంది. బయట పునరుత్పత్తి చేయదు.

102 రోజులు కొవిడ్‌తో అవస్థపడి..

ఏకంగా 102 రోజులపాటు కొవిడ్‌తో పోరాడి కన్నుమూసిన ఓ వ్యక్తి కేసును కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ పేషెంట్‌ వయస్సు 72ఏళ్లు. ఆ పేషెంట్‌కు లింఫోమా అనే రకం క్యాన్సర్‌ ఉంది. ఈ లింఫోసిస్టమ్‌కు రోగనిరోధక శక్తికి దగ్గరి సంబంధం ఉంది. ఆ పేషెంట్‌ కీమో థెరపీ తీసుకొన్నాడు. అతడికి కొవిడ్‌ సోకి 102 రోజుల పాటు ఇబ్బంది పడి మృతి చెందాడు.

ఈ 102 రోజుల్లో వేర్వేరు సందర్భాల్లో 23సార్లు నమూనాలు తీసుకొని వైరస్‌ జన్యువులను విశ్లేషించారు. ఈ సందర్భంగా పలు రకాల మ్యూటేషన్లను గుర్తించారు. అవి వేగంగా వ్యాపించడం.. రోగ నిరోధక శక్తిని తప్పించుకునే లక్షణాలను కలిగి ఉండటం వంటి లక్షణాలున్నట్లు తేల్చారు. 57 రోజుల వ్యవధిలో రెండు సార్లు రెమిడెసివిర్‌ కోర్సును వాడారు. కానీ, ఆ ఔషధం విఫలమైంది. దీంతో కొన్నాళ్లు కన్వల్సెంట్‌ ప్లాస్మా చికిత్సను చేశారు. ఆ సమయంలో అతనిలో వైరస్‌ మరింత వేగంగా మ్యూటేషన్‌ చెందుతున్నట్లు గుర్తించారు. లింఫో క్యాన్సర్‌, కీమోథెరపీ కారణంగా రోగనిరోధక శక్తి బాగా బలహీనపడి ఈ విధంగా జరిగినట్లు వైద్యులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫిబ్రవరిలో నేచర్‌ పత్రిక వెల్లడించింది.

152 రోజులు 12 మ్యూటేషన్లు..

హార్వర్డు మెడికల్‌ స్కూల్‌ పరిశోధించిన మరో కేసులో పేషెంట్‌ 152 రోజులపాటు కొవిడ్‌తో పోరాడారు. అతడు రోగనిరోధక శక్తిని తగ్గించేందుకు గతంలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో ఆ పేషెంట్‌ యాంటీ కాగ్యులెంట్స్‌, స్టెరాయిడ్స్‌, యాంటీవైరల్స్‌ వినియోగించాడు. అతడికి కొవిడ్‌ సోకి 152 రోజులు పాటు ఉంది. ఆ క్రమంలో శాస్త్రవేత్తలు అతడిలో వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో మొత్తం 12 మ్యూటేషన్లను గమనించారు. వీటిల్లో కొన్ని ఇమ్యూనిటీని తప్పించుకొనేవిగా గుర్తించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఇటువంటి పలు కేసులను శాస్త్రవేత్తలు, వైద్యులు గుర్తించారు. దీనిపై అమెరికా శాస్త్రవేత్తలు న్యూఇంగ్లాండ్‌ మెడికల్‌ జర్నల్‌లో వ్యాసం రాశారు. ముఖ్యంగా కొందరు క్యాన్సర్‌ చికిత్సలు, గ్లూకోకార్టికాయిడ్ల వినియోగం, దీర్ఘకాలిక కీమో లేదా రేడియోథెరపీ చేయించుకుని.. వివిధ మార్గాల్లో ఇమ్యూనిటీని తగ్గించుకుంటున్నారు. అటువంటి వారిలో రోగనిరోధక శక్తిని తప్పించుకొనే మ్యూటేషన్లు రూపొందుతాయేమో పరిశోధించాలని పేర్కొన్నారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో సార్స్‌కోవ్‌-2 ఎక్కువకాలం ఉంటే.. అది ఇమ్యూనిటీని తట్టుకొనే ఉత్పరివర్తనాలకు కారణం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని