కరోనా పరిచయం చేయనున్న కొత్త కాన్సెప్ట్‌!

మహమ్మారి మాయతో 2020లో మన జీవన విధానమే మారిపోయింది. మన నిత్యావసర సరకుల జాబితాలో క్రిమిసంహారిణులు, మాస్కులు, చేతి తొడుగులు, శానిటైజర్లు చేరిపోయాయి. రోగనిరోధకత పెంచే ఆహారం తీసుకోవడం......

Published : 28 Dec 2020 15:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహమ్మారి మాయతో 2020లో మన జీవన విధానమే మారిపోయింది. మన నిత్యావసర సరకుల జాబితాలో క్రిమిసంహారిణులు, మాస్కులు, చేతి తొడుగులు, శానిటైజర్లు చేరిపోయాయి. రోగనిరోధకత పెంచే ఆహారం తీసుకోవడం, ఇతరులకు దూరంగా ఉండడం అలవాటైపోయింది. ఈ క్రమంలో మహమ్మారి మనకు మరో కొత్త కాన్సెప్ట్‌లను పరిచయం చేస్తోంది. వాటిలో వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్ కూడా ఒకటి‌. అవును.. విదేశాలకు వెళ్లేటప్పుడు మనకు పాస్‌పోర్ట్‌ ఎలా తప్పనిసరో.. భవిష్యత్తులో వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ కూడా కచ్చితం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ అంటే.. మనం కరోనా టీకా తీసుకున్నామని ధ్రువపత్రం అన్నమాట. లేదా మనం కొవిడ్‌తో బాధపడడం లేదని నిరూపించుకోవడం. అయితే.. ఇది ఓ యాప్‌ రూపంలో రానుండడం విశేషం.

థియేటర్లు, షాపింగ్ మాళ్లు, వివాహాది శుభకార్యాలు, కార్యాలయాలు, బస్‌ స్టాండ్‌, రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం ఇలా ఎక్కడికి వెళ్లినా.. థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పనిసరైంది. కొవిడ్‌ సోకిన వారిలో జ్వరం ఓ లక్షణం కావడంతో ఇది వెంటనే పసిగడుతుందని ఈ పద్ధతిని తప్పనిసరి చేశారు. ఇక ఇప్పుడు టెస్టింగ్‌ బాగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో పరీక్షా ఫలితాలను కూడా చూపించాల్సి రావొచ్చు. దీనికి ప్రత్యేకంగా మనం ఎలాంటి డాక్యుమెంట్లు, ధ్రువపత్రాలు అవసరం లేకుండా అందరికీ ఆమోదనీయమైన యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. వీటినే వ్యాక్సిన్‌ పాస్‌పోర్టులుగా వ్యవహరిస్తున్నారు.

ఎలా పనిచేస్తుందంటే...

* వీటికి సంబంధించి ఇప్పటికే కొన్ని కంపెనీలు యాప్‌ను రూపొందించాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని.. అందులో మ‌న క‌రోనా నిర్ధారణ పరీక్షా ఫ‌లితాలు లేదా టీకా వేయించుకున్న వివరాలు నమోదు చేయాలి. ఎప్పుడైనా కరోనా నిర్ధారణ వివరాల గురించి అడిగిన‌ప్పుడు ఈ వివ‌రాల‌ను ఆధారాలుగా చూపిస్తే సరిపోతుంది.

* ‘కామ‌న్ పాస్‌’ (Common Pass) అనే యాప్‌ ఈ కోవకు చెందినదే. కామన్‌ ట్రస్ట్‌ నెట్‌వ‌ర్క్ అనే సంస్థ రూపొందించిన ఈ యాప్‌లో కొవిడ్‌-19 పరీక్ష ఫ‌లితం, వ్యాక్సినేష‌న్ ఆధారాల‌కు సంబంధించిన సమాచారాన్ని నమోదుచేసుకోవచ్చు. వాటిని యాప్‌ ధ్రువీకిరంచుకున్న వెంటనే ఓ క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్‌ వస్తుంది. ఇక దీన్ని అవ‌స‌ర‌మైన చోట చూపిస్తే స‌రిపోతుంది.

* ఐబీఎం సైతం ‘డిజిటల్‌ హెల్త్‌ పాస్‌’ (Digital Health Pass) పేరుతో ఓ యాప్‌ను పరిచయం చేసింది. ఈ యాప్‌తో మన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, కరోనా పరీక్షా ఫలితాలకు సంబంధించిన వివరాల్ని ఇతర వ్యక్తులు లేదా సంస్థలు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.

* వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లుగా వ్యవహరిస్తున్న ఈ యాప్‌లలోని ఆధారాలను పరిగ‌ణించి థియేటర్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలతో సహా విదేశీయులను సైతం అనుమతించే అవకాశం కల్పించాలని ఇప్పటికే పలు సంస్థలు ఆయా దేశ ప్రభుత్వాలతో పాటు డబ్ల్యూహెచ్‌వోకు దరఖాస్తు చేసుకున్నాయి. చూడాలి మరి ఈ కాన్సెప్ట్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో.

ఇవీ చదవండి...

అమెరికాలో మున్ముందు మరిన్ని చీకటి రోజులు!

ఈయూలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని