
Zika virus: కేరళలో మరో కేసు..!
తిరువనంతపురం: కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గక ముందే కేరళలో జికా వైరస్ కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 73 ఏళ్ల వృద్ధురాలు ఈ వైరస్ బారిన పడినట్టు సోమవారం నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన మొదలైంది. తాజాగా నమోదైన కేసుతో రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 19కి చేరింది. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అధికారికంగా ధ్రువీకరించారు. అయితే అలప్పుజలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపిన 5 శాంపిళ్లను పరీక్షించగా ఫలితం నెగెటివ్ వచ్చింది.
గడిచిన ఆదివారం కేరళలో మూడు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలోని తిరువనంతపురం, త్రిస్సుర్, కోయికోడ్‌లలోని వైద్య కళాశాలలు, అలప్పుజలోని ఎన్‌ఐవీలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో 2,100 పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచింది. ప్రత్యేకించి గర్భిణీలు సహా జ్వరం, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్ల లాంటి లక్షణాలు కనిపించినవారిని పరీక్షించాల్సిందిగా ఆసుపత్రులకు సూచించింది.
ఇవీ చదవండి
Advertisement