Drones: ‘పాక్‌ మాదిరి దుశ్చర్యలకు కాదు.. మానవాళి సేవకే మా డ్రోన్లు’

పాకిస్థాన్‌ మాదిరి ఆయుధాలు జారవిడిచి ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు కాకుండ.. మానవాళి సేవ కోసం భారత్‌ తన డ్రోన్‌లను వినియోగిస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. ఇవి ‘సంజీవని మూలిక’ల వాహకాలుగా పనిచేస్తున్నాయని, శాంతి సందేశాన్ని చేరవేస్తున్నాయన్నారు...

Published : 28 Nov 2021 01:27 IST

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ మాదిరి ఆయుధాలు జారవిడిచి ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు కాకుండ.. మానవాళి సేవ కోసం భారత్‌ తన డ్రోన్‌లను వినియోగిస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. ఇవి ‘సంజీవని మూలిక’ల వాహకాలుగా పనిచేస్తున్నాయని, శాంతి సందేశాన్ని చేరవేస్తున్నాయన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాల్లో కొవిడ్‌ టీకాల సరఫరాకు ఏర్పాటు చేసిన యూఏవీని శనివారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ మీడియం-క్లాస్ ఆక్టాకాప్టర్ యూఏవీ.. ఇక్కడి సీఎస్‌ఐఆర్‌- ఐఐఐఎంసీ నుంచి మార్హ్‌లోని పీహెచ్‌సీకి టీకా వాయిల్స్‌, సిరంజీలు చేరవేసింది. దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తికి ఈ తరహా వినూత్న చర్యలు దోహదపడతాయని మంత్రి చెప్పారు. 

అన్ని అనుమతులతోనే..

ఈ జీపీఎస్‌ ఆధారిత గైడెడ్ బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్(బీవీఎల్‌ఓఎస్‌) ఆక్టాకాప్టర్ యూఏవీని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్‌)కి చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్‌ఏఎల్‌) అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్‌.. 20 కిలోల వరకు బరువు మోయగలదు. స్థానికంగా డ్రోన్‌ల వినియోగం విషయంలో ఆంక్షలపై మంత్రి మాట్లాడుతూ.. అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కొన్నాళ్ల క్రితం పాక్‌వైపు నుంచి ప్రవేశించిన కొన్ని డ్రోన్లు భారత భూభాగంలో దాడులకు పాల్పడటం, ఆయుధాలు జారవిడవడంతో.. స్థానికంగా వీటి అమ్మకాలు, వినియోగం, పరికరాల నిల్వపై అధికారులు నిషేధం విధించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని