Drones: ఫ్యూజ్‌ లాగితే కదులుతున్న పాక్‌ డొంక! 

జమ్మూ వైమానిక దళ స్థావరంపై ఇటీవల జరిగిన డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ హస్తాన్ని సూచించే

Updated : 12 Jul 2021 09:58 IST

జమ్మూ డ్రోన్‌ దాడిలో పొరుగు దేశపు హస్తం 
బాంబులో కీలక సాధనాల ఆధారంగా అనుమానాలు 

జమ్మూ/ దిల్లీ: జమ్మూ వైమానిక దళ స్థావరంపై ఇటీవల జరిగిన డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ హస్తాన్ని సూచించే కీలక ఆధారాన్ని భారత భద్రతా దళాలు గుర్తించాయి. నాటి దాడిలో డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ‘ప్రెజర్‌ ఫ్యూజ్‌’లు ఉన్నాయి. దీన్నిబట్టి ఈ బాంబుల తయారీలో పొరుగు దేశపు సైన్యం.. లష్కరే తొయిబా ఉగ్రవాద ముఠాకు సాయపడి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. జూన్‌ 27న సదరు డ్రోన్‌ దాడి జరిగిన సంగతి తెలిసిందే. నాడు రెండు డ్రోన్లు బాంబులను జారవిడిచాయి. ఇందులో ఒకటి.. వైమానిక స్థావరంలో పైకప్పును పేల్చేసింది. ఆ పేలుడు పదార్థం (ఐఈడీ)లో కిలో కన్నా తక్కువగా ఆర్‌డీఎక్స్, అనేక ఇతర రసాయనాలను ఉపయోగించారని అధికారులు తెలిపారు. రెండో బాంబులో కిలో కన్నా ఎక్కువగా ఆర్‌డీఎక్స్, విస్ఫోట తీవ్రతను పెంచడానికి బాల్‌ బేరింగ్‌లను అమర్చారని చెప్పారు. ఈ పేలుడు పదార్థాల్లో వాడిన ‘ప్రెజర్‌ ఫ్యూజ్‌’లు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వీటిని బాంబులోని ప్రధాన డిటోనేటర్‌కు, పేలుడు పదార్థానికి మధ్య అమరుస్తుంటారు. ఈ సాధనాలను సాధారణంగా మందుపాతరలు, ట్యాంకు విధ్వంసక మందుపాతరలు, వైమానిక దాడుల్లో జారవిడిచే బాంబుల్లో ఉపయోగిస్తుంటారు. బాంబు నేలను తాకినప్పుడు లేదా దానిపై ఒక వ్యక్తి కాలుమోపినప్పుడు కలిగే ఒత్తిడి వల్ల ఈ సాధనం క్రియాశీలమై, విస్ఫోటాన్ని కలిగిస్తుంది. శతఘ్నులు, మోర్టారు బాంబుల్లోనూ ఈ ఫ్యూజ్‌లను వాడుతుంటారు. అందువల్ల అవి గాల్లో పేలవు. లక్ష్యాన్ని తాకాకే విస్ఫోటం చెందుతుంటాయి. జమ్మూ దాడిలో వాడిన ప్రెజర్‌ ఫ్యూజ్‌లను ఐఈడీల కొనభాగంలో అమర్చారు. ఈ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ఉగ్రవాదుల వద్ద ఉండదని, కచ్చితంగా పాక్‌ సైన్యం లేదా ఆ దేశ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ అందించిన సాంకేతిక తోడ్పాటుతోనే ముష్కరులు వాటిని తయారుచేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని