Pakistan-China: పిలిస్తే రాలేదు.. సొంత చర్చలు పెట్టారు!

అఫ్గానిస్థాన్‌ విషయంలో చైనా, పాకిస్థాన్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాలిబన్‌ ఆక్రమణ తర్వాత అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై భారత్‌ నిర్వహించిన ‘ప్రాంతీయ భద్రత చర్చ’లకు చైనా, పాక్‌ హాజరుకాని విషయం తెలిసిందే. అయితే, గురువారం పాక్‌ ప్రభుత్వం

Published : 11 Nov 2021 19:22 IST

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌ విషయంలో చైనా, పాకిస్థాన్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాలిబన్‌ ఆక్రమణ తర్వాత అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై భారత్‌ నిర్వహించిన ‘ప్రాంతీయ భద్రత చర్చ’లకు చైనా, పాక్‌ హాజరుకాని విషయం తెలిసిందే. అయితే, గురువారం పాక్‌ ప్రభుత్వం అఫ్గాన్‌ పరిస్థితులపై ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో రష్యాతోపాటు చైనా పాల్గొనడం గమనార్హం. ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలు.. అఫ్గాన్‌ ప్రజలను మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చాయి. ఇదే సమయంలో అక్కడి ప్రజల మానవ హక్కులను కూడా తాలిబన్లు గౌరవించాలని కోరాయి.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్కడ పెరుగుతోన్న ఉగ్రవాదాన్ని కట్టడి చేయాల్సిన అవసరముందని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో ఆసియా దేశాలు దృఢనిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌పై చర్చల కోసం మొదట రష్యా సమావేశం నిర్వహించింది. దీనికి అమెరికా హాజరుకాలేదు. బుధవారం భారత ప్రభుత్వం ఉన్నతస్థాయి చర్చలు జరిపింది. ఆసియా దేశాలన్నింటికి ఆహ్వానం పంపగా.. పాక్‌, చైనాలు ఈ చర్చలకు డుమ్మా కొట్టాయి. పాకిస్థాన్‌ కారణం చెప్పకుండానే చర్చలకు రాలేమని తేల్చి చెప్పగా.. చైనా మాత్రం షెడ్యూల్‌ కుదరకపోవడం వల్ల రాలేకపోతున్నామని సాకు చూపింది. కానీ, మరుసటి రోజు పాక్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైంది.

ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన సమావేశం సందర్భంగా పాక్‌ విదేశాంగశాఖ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ అఫ్గాన్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే.. ఆ దేశంతోపాటు పొరుగు దేశాలు కూడా అస్థిరతకు గురవుతాయని అన్నారు. అఫ్గాన్‌లో శాంతి, స్థిరత్వం తీసుకురావడానికి సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ చర్చించాయని వెల్లడించారు. ఇలాంటి చర్చల్లో అఫ్గాన్‌ ప్రతినిధులు కూడా ఉండాలని పాక్‌ సూచించింది. అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయాలని తాలిబన్లు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమింటే.. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖి ఇస్లామాబాద్‌లోనే ఉన్నారు. కానీ, చర్చల్లో పాల్గొనకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని