Kartarpur: గురుద్వారలో పాక్‌ మోడల్‌ ఫొటోషూట్‌.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!

సిక్కుల పవిత్రక్షేత్రమైన కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాలో ఓ పాకిస్థాన్‌ మోడల్‌ ఫొటోషూట్‌లో పాల్గొని వివాదంలో చిక్కుకుంది. గురుద్వారాల్లో నుదిటి భాగం కనిపించకుండా తలపై వస్త్రాన్ని కప్పుకోవడం తప్పనిసరి. కానీ, ఆమె వస్త్రం కప్పుకోకుండా ఫొటోలు దిగడంతో సిక్కు వర్గాలు ఆగ్రహం వ్యక్తం

Updated : 30 Nov 2021 13:18 IST

ఇస్లామాబాద్‌: సిక్కుల పవిత్రక్షేత్రమైన కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాలో ఓ పాకిస్థాన్‌ మోడల్‌ ఫొటోషూట్‌లో పాల్గొని వివాదంలో చిక్కుకుంది. గురుద్వారాల్లో నుదిటి భాగం కనిపించకుండా తలపై వస్త్రాన్ని కప్పుకోవడం తప్పనిసరి. కానీ, ఆమె వస్త్రం కప్పుకోకుండా ఫొటోలు దిగడంతో సిక్కు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై స్పందించిన పాకిస్థాన్‌.. ఈ ఘటనపై విచారణ చేపడతామని హామీ ఇచ్చింది.

లాహోర్‌కి చెందిన మోడల్‌ సౌలేహ ఇంతియాజ్‌ కర్తార్‌పూర్‌ గురుద్వారా ప్రాంగణంలో సోమవారం ఫొటోలు దిగగా.. ఆమె ఫొటోలను మన్నత్‌ క్లాతింగ్‌ అనే వస్త్రవ్యాపార సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే, ఆమె తలపై వస్త్రం ధరించకుండా ఫొటోలు దిగడం వివాదాస్పదంగా మారింది. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. శిరోమణి అకాలీదల్‌ ప్రతినిధి మంజిందర్‌ సింగ్‌ సిర్సా కూడా ఆమె ఫొటోలను షేర్‌ చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాక్‌ ప్రభుత్వాన్ని కోరారు.

మోడల్‌ క్షమాపణలు

ఫొటోలు వివాదాస్పదం కావడంతో మోడల్‌ సౌలేహ ఇంతియాజ్‌ క్షమాపణ చెప్పారు. ఎవరినీ బాధపెట్టాలని ఇలా చేయలేదని, కర్తార్‌పూర్‌ గురుద్వారాను సందర్శించిన సందర్భంగా ఫొటోలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి పనులు భవిష్యత్తులో చేయబోనన్నారు. ఆ ఫొటోలు పోస్ట్‌ చేసిన మన్నత్‌ క్లాతింగ్‌ సంస్థ కూడా క్షమాపణలు తెలిపింది. అది తాము నిర్వహించిన ఫొటోషూట్‌ కాదని, థర్డ్‌పార్టీ నుంచి వచ్చిన ఫొటోలను పోస్టు చేసినట్లు పేర్కొంది.

వివాదంపై పాకిస్థాన్‌ విచారణ

ఈ వివాదంపై పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వం స్పందించింది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసులను పంజాబ్‌ సీఎం ఉస్మాన్‌ బుజ్దార్‌ ఆదేశించారు.

Read latest National - International News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని