Param Bir Singh: ముంబయి పేలుళ్ల తర్వాత.. కసబ్‌ ఫోన్‌ను ధ్వంసం చేసిన పరంబీర్‌..!

బలవంతపు వసూళ్లకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌పై మరిన్ని సంచలన ఆరోపణలు వస్తున్నాయి

Updated : 26 Nov 2021 16:20 IST

ఫిర్యాదు చేసిన విశ్రాంత పోలీసు అధికారి

ముంబయి: బలవంతపు వసూళ్లకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌పై మరిన్ని సంచలన ఆరోపణలు వస్తున్నాయి. 13ఏళ్ల క్రితం ముంబయి నగరంపై దాడికి పాల్పడిన పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్‌ను పరంబీర్‌ సింగ్‌ ధ్వంసం చేశారని విశ్రాంత అసిస్టెంట్ పోలీస్‌ కమిషనర్‌ సంషేర్‌ ఖాన్‌ పఠాన్‌ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దాడుల తర్వాత కసబ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను అప్పటి సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.ఆర్‌ మాలి.. కాంబ్లీ అనే కానిస్టేబుల్‌కు ఇచ్చినట్లు సంషేర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉగ్రదాడి సమయంలో టెర్రరిస్టు నిరోధక దళ డీఐజీగా ఉన్న పరంబీర్‌ ఆ ఫోన్‌ను కానిస్టేబుల్‌ నుంచి తీసుకున్నారని.. అయితే దాన్ని అప్పటి దర్యాప్తు అధికారి రమేశ్‌ మహాలేకు ఇవ్వకుండా పరంబీర్‌ ధ్వంసం చేశారని సంషేర్‌ ఆరోపించారు. 

కాగా.. ఈ ఏడాది జులైలో సంషేర్‌ ఈ ఫిర్యాదు చేయగా.. గురువారం అకస్మాత్తుగా ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై తాజాగా సంషేర్‌ మాట్లాడుతూ.. ‘‘ఉగ్రదాడిలో లభ్యమైన కీలక సాక్ష్యాన్ని ధ్వంసం చేసినందుకు పరంబీర్‌ను అరెస్టు చేయాలి. ఆ ఫోన్‌ నుంచి సేకరించిన సమాచారాన్ని అతడు ఉగ్రవాద సంస్థలకు విక్రయించి ఉంటాడు. లేదా బలవంతపు వసూళ్ల కోసమైనా వాడుకుని ఉంటాడు’’ అని ఆరోపించారు. 

ముంబయిలో వరుస పేలుళ్లకు పాల్పడి వందలమందిని పొట్టనబెట్టుకున్న అజ్మల్‌ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ విచారణ తర్వాత అతడికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించగా.. 2012 నవంబరులో కసబ్‌ను ఉరితీశారు. ఇదిలా ఉండగా.. ముంబయిలో 26/11 పేలుళ్ల ఘటనకు నేటికి 13ఏళ్లు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని