
హోంమంత్రిపై ఆరోపణల కేసులో కీలక మలుపు!
సుప్రీంకోర్టులో పరమ్‌వీర్ పిటిషన్
నిస్పాక్షిక దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి
ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేసిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ నేడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను హోంగార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై స్టే విధించడంతో పాటు బదిలీల్లో జరిగిన అవకతవకలపై కేశ్ శుక్లా నివేదికపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పరమ్‌వీర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక హోంమంత్రి ఆరోపణలపై సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉన్నందున, అంతకు ముందే ఆయనపై నిష్పాక్షికమైన దర్యాప్తు చేయాలని పరమ్‌వీర్ సింగ్ కోరారు. తాను హోంమంత్రిపై చేసిన ఆరోపణలను ధ్రువపరిచే సాక్ష్యాల్లో భాగంగా, అనిల్ దేశ్‌ముఖ్ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ వీడియోలను కూడా సేకరించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలు అబద్ధమని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టంచేశారు. ముకేశ్ అంబానీకి బాంబు బెదిరింపుకేసులో అరెస్టైన సచిన్ వాజే, హోంమంత్రిని కలిసినట్లు పరమ్‌వీర్ చేస్తోన్న ఆరోపణల్లోనూ నిజం లేదన్నారు.