మహా హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తు జరిపించండి..!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated : 26 Mar 2021 10:09 IST

బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేసిన పరమ్‌బీర్‌ సింగ్‌

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100కోట్ల వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు టార్గెట్‌ విధించడంపై పూర్తి దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌లో కోరారు. ఆలస్యం చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, అందుకే వీలైనంత తొందరగా నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించాలని బాంబే హైకోర్టును విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై తాను చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని పరమ్‌బీర్‌ సింగ్‌ తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పరమ్‌బీర్‌ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై బాంబే హైకోర్టును ఆశ్రయించాలని పరమ్‌బీర్‌కు సూచించింది. సుప్రీం సూచనలకు అనుగుణంగా పరమ్‌బీర్‌ సింగ్‌ నేడు బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

సచిన్‌ వాజేతో పాటు ముంబయికి చెందిన చాలా మంది పోలీసు అధికారులతో హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఫిబ్రవరి నెలలో వరుస సమావేశాలు నిర్వహించినట్లు పరమ్‌బీర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలోనే నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే దేశ్‌ముఖ్‌ వ్యవహార శైలిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాంబే హైకోర్టును పరమ్‌బీర్‌ విజ్ఞప్తి చేశారు. వీటిని ధ్రువపరిచేందుకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇంటివద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా వీలైనంత తొందరగా సేకరించేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని