Madhya pradesh: ఆ రైల్వే స్టేషన్‌కు టాంట్య భీల్‌ పేరు.. ఆయన ఎవరో తెలుసా?

ప్రాంతాల పేరు మార్పు విషయంలో ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు, రైల్వేస్టేషన్ల పేరులో మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్‌’గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని

Published : 23 Nov 2021 22:08 IST

భోపాల్‌: ప్రాంతాల పేరు మార్పు విషయంలో ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు, రైల్వేస్టేషన్ల పేరులో మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్‌’గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న పాతాళ్‌పానీ రైల్వేస్టేషన్‌తోపాటు.. మరో రెండు ప్రాంతాల పేరును ‘టాంట్య భీల్‌’గా మారుస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. స్థానిక గిరిజనుల ఖ్యాతిని పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో భోపాల్‌లోని హబిబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన తెగకు చెందిన మహారాణి కమలాపతి పేరును పెట్టింది.

ఇండోర్‌లో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శివరాజ్‌ చౌహాన్‌.. గత ప్రభుత్వాలు గిరిజనును విస్మరించాయని ఆరోపించారు. దేశంలో, మధ్యప్రదేశ్‌లో ఉన్న గిరిజనులకు గొప్ప చరిత్ర ఉందని, స్వాతంత్ర్యపోరాటంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మన గిరిజనుల ఆత్మగౌరవాన్ని అణిచివేసేందుకు అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. టాంట్య భీల్‌ దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తెగ యోధులకు సముచిత గౌరవాన్ని ఇస్తుందని సీఎం శివరాజ్‌ చెప్పారు. 

ఎవరీ టాంట్య భీల్‌?

మధ్యప్రదేశ్‌లో ఖాండ్వా జిల్లాలోని ఆదివాసి తెగలో జన్మించిన టాంట్య భీల్‌ ఓ బందిపోటు. 1878-1889 మధ్య అనేక దోపిడీలు చేశాడని, అతడో నేరస్థుడని బ్రిటీష్ ప్రభుత్వం ముద్ర వేసింది. కానీ, భారతీయులు ఆయన్ను ఒక దేశభక్తుడిగా.. నాయకుడిగా భావిస్తారు. ఎందుకంటే, ఆయన బ్రిటీష్‌ ఖాజానాలను కొల్లగొట్టి.. పేద ప్రజలకు పంచిపెట్టేవారట. ఈ క్రమంలోనే ఆయనకు ఇండియన్‌ రాబిన్‌ హుడ్‌ అనే పేరొచ్చింది. అయితే, బంధువుల ద్రోహంతో బ్రిటీష్ పోలీసుల చేతికి చిక్కిన టాంట్య భీల్‌.. 1889 డిసెంబర్‌ 4న ఉరికంభం ఎక్కారు. ఆయన మృతదేహాన్ని బ్రిటీష్‌ పోలీసులు పాతాళ్‌పానీ రైల్వేస్టేషన్‌ సమీపంలో విసిరేశారట. ఆ తర్వాత టాంట్య భీల్‌ మృతదేహం పడిన ప్రాంతంలోనే ఆయనకు సమాధి నిర్మించారు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి చేరుకోగానే.. టాంట్య భీల్‌ గౌరవార్థం లోకో పైలట్లు రైళ్లను కాసేపు నిలిపివేస్తుంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని