PM Modi: ఆ ఘటన బాధించింది: ప్రధాని మోదీ

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది......

Published : 07 Nov 2021 01:53 IST

దిల్లీ: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన బాధాకరమన్నారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగగా.. 10మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడగా.. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. క్షతగాత్రులైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. 

మృతులకు ₹5లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటన
మరోవైపు, విషాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే లోతైన దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనలో మృతులకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం జిల్లా బాధ్యతలు చూసే మంత్రి హసన్‌ ముష్రిఫ్‌, సీఎస్‌ సీతారామ్‌ కుంటెలకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇతర రోగులకు సరైన వైద్యం అందేందుకు ఆటంకం రాకుండా వేరే ఆస్పత్రులకు తరలించాలని సూచించినట్టు సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. 

షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ప్రమాదం!
ఆ ఆస్పత్రిలో మిగతా కొవిడ్ రోగులను వేరే ఆస్పత్రికి తరలించినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ రాజేంద్ర భోస్లే తెలిపారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే జరగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. ఆస్పత్రిలో ఈ ఐసీయూ వార్డు కొత్తగా నిర్మించిందేనని మంత్రి నవాబ్‌ మాలిక్‌ తెలిపారు. ఈఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని  అన్ని ఆస్పత్రుల్లో ఫైర్‌ ఆడిట్‌ నిర్వహించాలన్నారు. భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని