Updated : 28/03/2021 13:44 IST

‘మన క్రమశిక్షణ.. ప్రపంచానికే ఉదాహరణ’

దిల్లీ: గతేడాది దేశవ్యాప్తంగా చేపట్టిన జనతా కర్ఫ్యూలో భారతీయులు చాటిన క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం 75 ఎడిషన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ శ్రోతలకు ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్‌ కార్యక్రమం!

‘గతేడాది మార్చిలో కరోనాను కట్టడి చేసేందుకు మనం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను చేపట్టాం. ఈ కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన అసాధారణ క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలిచింది. అంతేకాకుండా దీన్ని భవిష్యత్‌ తరాలు సైతం గుర్తు పెట్టుకుంటాయి. ప్రస్తుతం మనదేశంలో ప్రపచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. యూపీలోని జౌన్‌పూర్‌లో 109 ఏళ్ల వృద్ధురాలు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అదేవిధంగా దిల్లీలో 107ఏళ్ల వృద్ధురాలు టీకా తీసుకున్నారు. మనం ప్రజలందర్నీ ‘దవాయి బీ, కడాయి బీ’(వైద్యం, జాగ్రత్తలు) అనే మంత్రానికి కట్టుబడి ఉండేలా చేయాలి’ అని మోదీ వెల్లడించారు.

అన్ని రంగాల్లో దేశ మహిళల సత్తా!

‘భారత మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతోపాటు ఇతర అన్ని రంగాల్లో తమదైన సత్తా చాటుతున్నారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్‌ ప్రపంచ కప్‌లో భారత్‌ ఉన్నత స్థానం సాధించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌ మిథాలీరాజ్‌కు శుభాకాంక్షలు. బ్యాడ్మింటన్‌ స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీలో రజత పతకం సాధించిన పీవీ సింధుకు అభినందనలు. మార్చి నెలలో మనం మహిళా దినోత్సవం జరుపుకొన్నాం. ఇదే నెలలో మన దేశ మహిళలు క్రీడల్లో పతకాలు, రికార్డులు సాధించడం విశేషం’అని మోదీ అభినందించారు.

అమృత్‌ మహోత్సవ్‌లో భాగం కావాలి

‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 నాటికి 75వసంతాలు పూర్తి కానున్న నేపథ్యంలో... కేంద్రం ‘అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని తలపెట్టింది. అమృత్‌ మహోత్సవ్‌కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి ఒక ప్రాంతం చరిత్రగానీ, ఒక వ్యక్తి గురించి గానీ, సంస్కృతి గానీ తెరపైకి తెచ్చి దేశస్థులతో పంచుకోవచ్చు. మన చుట్టూ ఉన్న అపారమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తూనే.. కొత్త తరానికి చేరుకోవడానికి మనం కృషి చేయాలి’’ అని ప్రధాని చెప్పారు.

వీరి ప్రయత్నాలు ఎందరికో స్ఫూర్తి!

తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన బస్‌ కండక్టర్‌ యోగనాథన్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే చెట్లు నాటడం పట్ల అవగాహన కల్పిస్తున్న తీరు ఎంతో బాగుందన్నారు. అదేవిధంగా ఒడిశాలోని కేంద్రపాడకు చెందిన విజయ్‌ అనే వ్యక్తి 12 సంవత్సరాలు శ్రమించి సముద్రం ఒడ్డున 25 ఎకరాల మడ అడవిని నిర్మించారని అభినందించారు. ‘ఇటీవల మనం పిచ్చుకల దినోత్సవం జరుపుకొన్నాం. కాబట్టి ప్రకృతిలో పిచ్చుకల్ని రక్షించేందుకు మనం కృషి చేయాలి. ఈ సందర్భంగా బెనారస్‌కు చెందిన మన మిత్రుడు ఇంద్రపాల్‌ గురించి చెప్పుకోవాలి. ఆయన తన ఇంటిని పిచ్చుకల నివాసంగా మార్చుకున్నారు. ఆయన ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం’అని మోదీ అన్నారు. వీరితోపాటు సమాజ శ్రేయస్సుకు పాల్పడుతున్న పలువురిని ప్రధాని మెచ్చుకున్నారు.Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని