సైన్యంలోకి సరికొత్త అర్జునుడొచ్చాడు..!

సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్‌ ట్యాంక్‌ చేరింది. నేడు ప్రధాని మోదీ తమిళనాడు పర్యాటనలో భాగంగా అర్జున్‌ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు.  చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా

Published : 14 Feb 2021 12:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్‌ ట్యాంక్‌ చేరింది. నేడు ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్‌ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు.  చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.  తేజస్‌ తర్వాత ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద భారత దళాలకు అందిన మరో అతిపెద్ద ఆయుధం అర్జున్‌ మార్క్‌1ఏ యుద్ధ ట్యాంకు కావడం విశేషం. వాస్తవానికి ఇప్పటికే సైన్యంలో అర్జున్‌(ఎంబీటీ) యుద్ధ ట్యాంకులు సేవలు అందిస్తున్నాయి. కానీ, దాదాపు 71 చిన్న, పెద్ద మార్పులతో అర్జున్‌ మార్క్‌1ఏ రూపంలో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చారు. దీంతో ఇది ప్రపంచ స్థాయి ఆయుధాలతో పోటీపడేలా సిద్ధమైంది.

భవిష్యత్తు యుద్ధ తంత్రానికి చెందిన వ్యవస్థలు దీనిలో ఉన్నాయి.  వీటిని హంటర్‌ కిల్లర్స్‌ అని కూడా పిలుస్తారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది స్థిరంగా పనిచేయగలదు. ఇది దాదాపు 68 టన్నుల బరువు ఉంటుంది. 120 ఎంఎం రౌండ్స్‌ వినియోగించే గన్‌ను దీనికి అమర్చారు. ఈ ట్యాంక్‌ను డీఆర్‌డీవో చెన్నై విభాగంలోని కాంబాట్‌ వెహికల్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీవీఆర్డీఈ) అభివృద్ధి చేసింది.  ఈ ట్యాంక్‌లో 14 వరకు ప్రధాన మార్పులు ఉన్నాయి. వీటిల్లో పేటెంట్‌ పొందిన టెక్నాలజీనే అత్యధికంగా వినియోగించారు. ఈ ట్యాంక్‌ ఆత్మరక్షణ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ ట్యాంక్‌ గన్‌లో లక్ష్యాన్ని ఆటోమేటిక్‌గా ట్రాక్‌ చేసే ప్రత్యేక వ్యవస్థను అమర్చారు. దీంతో వేగంగా కదులుతున్న లక్ష్యాలను కూడా ఈ ట్యాంక్‌ సులభంగా పేల్చివేయగలదు. ట్యాంక్‌ వేగంగా ప్రయాణిస్తూ కూడా ఇతర లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. కంప్యూటర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థ ట్యాంక్‌ గన్‌ను నియంత్రిస్తుంది. రాత్రి, పగలు తేడా లేకుండా లక్ష్యాలను సులభంగా గుర్తించగలిగే వ్యవస్థ దీనిలో ఉంది.

ఈ ట్యాంక్‌ ప్రయోగించే తూటాలు(మందుగుండు)కూడా ప్రత్యేకమైనవే. దీని తూటా లక్ష్యాన్ని చేరుకోగానే అక్కడి ఆక్సిజన్‌ను పూర్తిగా వినియోగించుకొని పేలుతుంది. దీంతో పాటు చొచ్చుకుపోయిన తర్వాత విస్ఫోటం చెందేలా వీటిని తయారు చేశారు.

ఇవీ చదవండి

ఆ తల్లి ఫోన్‌ కాల్‌.. 25 మందిని కాపాడింది

కూతురు పుట్టిన వేళ.. పదవొచ్చిన వేళ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని