Afghanisthan: అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను త్వరగా రప్పించండి

అఫ్గానిస్థాన్‌లోని గురుద్వార్‌లో చిక్కుకున్న 200 మంది సిక్కులతో సహా భారతీయులందరినీ తీసుకురావడానికి ముమ్మర ఏర్పాట్లు

Published : 16 Aug 2021 23:59 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న 200 మంది సిక్కులతో సహా భారతీయులందరినీ తీసుకురావడానికి ముమ్మర ఏర్పాట్లు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం మన దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అన్ని సరిహద్దు ప్రాంతాల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కు సోమవారం ట్వీట్‌ చేశారు.‘అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి గురుద్వారాలో దాదాపు 200 మంది సిక్కులు చిక్కుకున్నారు. వారితో సహా అక్కడున్న భారతీయులందరినీ తక్షణమే భారత్‌కు రప్పించడానికి ఏర్పాట్లు చేయాలి. దీనికి అవసరమైన సహాయ సహాకారాలను అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దేశ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దేశం విడిచి వెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆ దేశంలో ఉన్న తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు భారత్‌, అమెరికా సహా పలు దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని