Punjab: పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు

పంజాబ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ ధరలను రూ.10, డీజిల్‌పై రూ.5 తగ్గిస్తున్నట్లు.......

Updated : 07 Nov 2021 17:58 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. పంజాబ్‌లో పెట్రోల్‌ ధరలను రూ.10, డీజిల్‌పై రూ.5 తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీ ప్రకటించారు. గడిచిన 70 ఏళ్లలో చమురు ధరల్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే మొదటిసారి అని చన్నీ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లోనే అతి తక్కువ ధరలు ఉన్నాయన్నారు. పెట్రోల్‌ ధర దేశ రాజధాని దిల్లీ కంటే తమ రాష్ట్రంలో రూ.9 తక్కువగా ఉందని వెల్లడించారు.

దేశంలో ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు దీపావళి పండుగ వేళ పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన విషయం తెలిసిందే. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు గురువారం నుంచే అమలులోకి వచ్చాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా ఈ ప్రక్రియను అమలు చేయలేదు. దీంతో పెట్రో ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని