Punjab: దిల్లీ ‘ట్రాక్టర్‌ ర్యాలీ’.. అరెస్టయిన రైతులకు రూ.2లక్షల సాయం

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి పంజాబ్‌ ప్రభుత్వం మరోసారి సంఘీభావం తెలిపింది. దిల్లీ ‘ట్రాక్టర్‌ ర్యాలీ’

Updated : 13 Nov 2021 11:39 IST

పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

చండీగఢ్‌: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి పంజాబ్‌ ప్రభుత్వం మరోసారి సంఘీభావం తెలిపింది. దిల్లీ ‘ట్రాక్టర్‌ ర్యాలీ’లో అరెస్టయిన రైతులకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గతేడాది నవంబరు నుంచి దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. నిరసనల్లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు అనుమతించిన రూట్లలో కాకుండా కొందరు ఆందోళనకారులు మరో మార్గంలో వెళ్లి చారిత్రక ఎర్రకోటను ముట్టడించారు. కోటపై జెండా ఎగురవేశారు. అడ్డుకున్న పోలీసులతోనూ ఘర్షణలకు దిగారు. దీంతో దేశ రాజధానిలో హింసాత్మక పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు 83 మంది రైతులను అరెస్టు చేశారు. 

తాజాగా ఆ రైతులకు పంజాబ్‌ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ‘‘మూడు నల్ల సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న రైతు ఉద్యమానికి మా ప్రభుత్వం మద్దతు ఉంటుందని మరోసారి పునరుద్ఘాటిస్తున్నా. జనవరి 26న దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టినందుకు దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 83 మంది రైతులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించాం’’ అని సీఎం చన్నీ ట్విటర్‌లో వెల్లడించారు. అయితే తాజా నిర్ణయం.. కేంద్రం, పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మధ్య కొత్త వివాదానికి తెరలేపే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని