అంతరిక్షంలోకి మోదీ ఫొటో..! 

ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. అంతేగాక ఇస్రో 50ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఒక శాటిలైట్‌లో

Published : 15 Feb 2021 10:54 IST

ఈ నెల 28న ప్రైవేటు ఉపగ్రహం ద్వారా పంపనున్న ఇస్రో

దిల్లీ: ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. అంతేగాక ఇస్రో 50ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఒక శాటిలైట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటం, భగవద్గీత కాపీ, 25,000 మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. 

ఫిబ్రవరి 28న పీఎస్‌ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ‘ఆనంద్‌’, ‘సతీశ్‌ ధావన్‌’, ‘యునిటీశాట్‌’ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. భారతీయ ఉపగ్రహాల్లో ‘ఆనంద్‌’ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్‌’ రూపొందించగా, ‘సతీశ్‌ ధావన్‌’ను చెన్నైకు చెందిన ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’, ‘యునిటీశాట్’‌ను జిట్‌శాట్‌ (శ్రీపెరంబుదూర్‌), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌(నాగ్‌పుర్‌), శ్రీశక్తి శాట్‌ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించటం విశేషం. 

ప్రముఖ భారత అంతరిక్ష శాస్త్రవేత్త సతీశ్‌ ధావన్‌ పేరు మీదుగా స్సేస్‌ కిడ్జ్‌ ఇండియా ‘సతీశ్‌ ధావన్‌(ఎస్‌డీ శాట్‌)’ ఉపగ్రహాన్ని రూపొందించింది. తమ సంస్థ నుంచి నింగిలోకి వెళ్తున్న తొలి ఉపగ్రహం‌ కావడంతో ఈ ప్రయోగానికి మరింత ప్రత్యేక తీసుకురావాలని స్పేస్‌కిడ్జ్‌ ఇండియా భావించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఉపగ్రహంలో పంపనున్నట్లు సంస్థ సీఈవో డాక్టర్‌ శ్రీమతి కేసన్‌ తెలిపారు. మోదీ పేరు, ఫొటో.. దాని కింద ‘ఆత్మనిర్భర్‌ మిషన్’‌ అనే పదాలతో పాటు, భగవద్గీత కాపీ, 25000 మంది పేర్లను తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. 

‘‘స్పేస్‌ సైన్స్‌, మా ప్రయోగం పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే అంతరిక్షంలోకి పంపేందుకు పేర్లు కావాలని అడిగాం.. వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి కాగా.. చెన్నైకి చెందిన ఓ పాఠశాల తమ విద్యార్థుల అందరి పేర్లు పంపింది. ఈ పేర్లతో పాటు మోదీ ఫొటోను పంపనున్నాం. ఇక విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. అందుకే, మేం మన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను పంపించాలనుకుంటున్నాం’’ అని డాక్టర్ శ్రీమతి వెల్లడించారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-51 వాహకనౌకను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

అమల్‌ పంపిన అమూల్య చిత్రం

కాబోయే భార్యకు చంద్రుడిపై భూమి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని