Rana couple: రాణా దంపతులకు మరో ఝులక్‌.. ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ ఆదేశాలు

హనుమాన్‌ చాలీసా పఠన వివాదంలో అరెస్టయి విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు మరో షాక్‌ తగిలింది.......

Published : 22 May 2022 02:01 IST

ముంబయి: హనుమాన్‌ చాలీసా పఠన వివాదంలో అరెస్టయి విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు మరో షాక్‌ తగిలింది. ముంబయిలో ఖేర్‌ ప్రాంతంలోని ఫ్లాట్‌లో కొంతభాగం అక్రమంగా నిర్మించుకున్నారని, దాన్ని వారం రోజుల్లోగా తొలగించాలని ముంబయి నగరపాలక సంస్థ (బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌) శనివారం ఆదేశాలు జారీ చేసింది. వారంరోజుల్లోగా తొలగించకపోతే ఆ పని, తామే చేస్తామని.. ఇంటి యజమానికి నెలరోజులపాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నట్లు హెచ్చరించింది. ఫ్లాట్‌ నిర్మాణానికి సంబంధించి అధికారుల నుండి అనుమతులు, ఆమోదం పొందిన ప్రణాళికల పత్రాలను సమర్పించడంలో యజమాని విఫలమయ్యారని బీఎంసీ తెలిపింది. దీంతో దాన్ని అక్రమ నిర్మాణంగా పరిగణించి కూల్చివేతకు ఆదేశించినట్లు పేర్కొంది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ కొద్దిరోజుల క్రితం నవనీత్‌ రాణా దంపతులు సవాలు విసిరిన విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ రాణా దంపతులపై ముంబయి పోలీసులు ఏప్రిల్‌ 23న రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను రాణా దంపతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులపై దాడి చేశారన్న ఆరోపణలపై ఏప్రిల్‌ 24న రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇరువురిని అరెస్టు చేసిన పోలీసులు.. బాంద్రాలోని మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరుచగా వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. అనంతరం ఆ దంపతులు ఈనెల 4వ తేదీన బెయిల్‌పై విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని