టీకా తీసుకున్న రతన్‌ టాటా

కరోనా కోరల్ని తుంచేసే బృహత్తర ప్రక్రియలో భాగంగా దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా.. నిరాటంకంగా కొనసాగుతోంది. రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తర్వాత రాష్ట్రపతి,

Published : 13 Mar 2021 12:55 IST

ముంబయి: కరోనా కోరల్ని తుంచేసే బృహత్తర ప్రక్రియలో భాగంగా దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా.. నిరాటంకంగా కొనసాగుతోంది. రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తర్వాత రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు టీకా వేయించుకున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. టీకా తీసుకుంటే అసలు నొప్పే లేదన్న టాటా.. అందరూ త్వరలోనే వ్యాక్సిన్‌ వేసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రూ.1500 కోట్ల విరాళాలు ప్రకటించి టాటా తన దాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. 

3కోట్లకు చేరువలో టీకా పంపిణీ..

దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవగా.. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులు, 45-59ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు టీకాలు ఇస్తున్నారు. రెండో దశలో భాగంగా ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం నాటికి 2.8కోట్ల మందికి టీకా డోసులు ఇచ్చారు. శుక్రవారం ఒక్కరోజే 20,53,457 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

మరోవైపు కొన్ని ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలు, బ్యాంకింగ్‌ సంస్థలు తమ ఉద్యోగులందరికీ టీకా ఇప్పించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కూడా ఉంది. తమ ఉద్యోగుల రెండు డోసుల టీకా ఖర్చులను తామే భరిస్తామని టీసీఎస్‌ గతంలో వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని