Taliban: మా పాలనను గుర్తించండి.. లేదంటే: తాలిబన్

తమ పాలనను అధికారికంగా గుర్తించాలని తాలిబన్లు అమెరికా సహా ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ దేశాల్లో స్తంభించిపోయిన నిధులను విడుదల చేయాలన్నారు....

Published : 01 Nov 2021 01:11 IST

అమెరికా సహా ప్రపంచదేశాలకు తాలిబన్ల విజ్ఞప్తి

కాబుల్‌: తమ పాలనను అధికారికంగా గుర్తించాలని తాలిబన్లు అమెరికా సహా ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ దేశాల్లో స్తంభించిపోయిన నిధులను విడుదల చేయాలని కోరారు. అఫ్గాన్‌ ఆస్తులపై ఆంక్షలు ఎత్తివేయలన్నారు. లేదంటే ఇది మున్ముందు అంతర్జాతీయ సమస్యగా పరిణమించే అవకాశం ఉందంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ హెచ్చరించే ప్రయత్నం చేశారు.

చివరిసారి అమెరికా, తాలిబన్ల మధ్య సరైన దౌత్యసంబంధాలు లేకపోవడం వల్లే యుద్ధం తలెత్తిందని ముజాహిద్‌ చెప్పుకొచ్చారు. చర్చలు, రాజకీయ సయోధ్య వల్ల అప్పుడు సమస్యలు పరిష్కారమై ఉండేవని వ్యాఖ్యానించారు. తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడం అఫ్గాన్‌ ప్రజల హక్కు అని పేర్కొన్నారు.

అఫ్గాన్‌లో పౌరప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు.. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఏ దేశమూ అధికారికంగా వారి పాలనను గుర్తించలేదు. పైగా ఆయా దేశాల్లో ఉన్న అఫ్గాన్‌ ఆస్తులు, నిధులను స్తంభింపజేశారు. ఇప్పటికే అఫ్గాన్‌ ప్రజలు తీవ్ర కరవుకాటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆర్థిక, మానవతా సంక్షోభం నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సమస్య మరింత పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో చేసేది లేక తాలిబన్లు గుర్తింపు కోసం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు.

తాలిబన్‌ ప్రభుత్వంతో పాకిస్థాన్‌, చైనా మాత్రం సఖ్యతగా ఉంటున్నాయి. గతవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ కతార్‌లో తాలిబన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. చైనాలోకి పాకిస్థాన్ మీదుగా ఎగుమతులకు వాంగ్‌ యీ హామీ ఇచ్చినట్లు ముజాహిద్‌ తెలిపారు. అలాగే దేశంలో రవాణా మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం అందజేసేందుకు చైనా అంగీకరించినట్లు వెల్లడించారు. మరోవైపు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సైతం గత వారం కాబుల్‌లో పర్యటించారు. పాకిస్థాన్‌తో నెలకొన్న సరిహద్దు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు ముజాహిద్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు