Corona: దిల్లీలో తగ్గిన కేసులు.. దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న విజృంభణ

దేశ రాజధాని దిల్లీ కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలో మాత్రం వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది......

Published : 17 Jan 2022 23:54 IST

దిల్లీ: కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.  అయితే దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు తగ్గుతూ.. రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశం. దిల్లీలో తాజాగా 12,527 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం(18,286)తో పోలిస్తే దాదాపు 6వేల కేసులు తగ్గాయి. అయితే పాజిటివిటీ రేటు 27.99 శాతంగా ఉంది. మొత్తం 18,340 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 24 మంది మృతిచెందారు. దేశ రాజధానిలో ప్రసుతం 83,982 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 68,275 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా.. 2,684 బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారాంతపు కర్ఫ్యూ కారణంగానే రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు సోమవారం ఉదయమే ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు.

ఇక దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలో మాత్రం కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో గత 24 గంటల్లో 27,156 కొత్త కేసులు వెలుగుచూశాయి. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 12.45 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో సగానికి పైగా రాజధాని బెంగళూరు నుంచే ఉన్నాయి. బెంగళూరులో 15,947 మందికి పాజిటివ్‌గా తేలింది. ఐదుగురు మరణించారు. 2,17,297 క్రీయాశీలక కేసులున్నాయి. బెంగళూరులో తాజాగా 287 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.కె.సుధాకర్‌ వెల్లడించారు. దీంతో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 766కు చేరిందని తెలిపారు.

కేరళలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 22,946 మందికి పాజిటివ్‌గా తేలింది. గత వారం కంటే 182 శాతం కేసుల్లో పెరుగుదల కనిపించిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,21,458 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 3.7శాతం మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందున్నట్లు రాష్ట్రం ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ముంబయిలో అమాంతం పెరిగిన కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,954 మందికి వైరస్‌ నిర్ధరణ అయ్యింది. వీరిలో 83 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. వైరస్‌తో 12 మంది మరణించారు. నగరంలో ప్రస్తుతం 50,757 యాక్టివ్‌ కేసులున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని