Indian Railway: రైళ్లలో ఉమ్మివేతలకు చెక్‌.. రైల్వే కొత్త స్కెచ్‌!

రైల్వేను ప్రధానంగా వేదిస్తున్న సమస్యల్లో ఉమ్మివేతలు ఒకటి. దీనికి చరమగీతం పాడేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది.

Published : 10 Oct 2021 18:46 IST

దిల్లీ: రైల్వేలను ప్రధానంగా వేదిస్తున్న సమస్యల్లో ఉమ్మివేతలు ఒకటి. బోగీల్లో ఎక్కడ చూసినా వాటి మరకలే ఉంటాయి. వీటిని తొలగించేందుకు రైల్వే శాఖ దాదాపు ఏటా రూ.1200 కోట్లు, వేల లీటర్ల నీటిని వినియోగించాల్సి వస్తోంది. అటు రైల్వేతో ఇటు ప్రయాణికులూ ఉమ్మివేతల వల్ల ఇబ్బంది పడుతుంటారు. గుట్కా, పాన్‌ మసాలా వాడే అలవాటు ఉన్నవారు ఆ బోగీలో ఉంటే అందులో ప్రయాణించే తోటి ప్రయాణికుల పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కరోనా వేళ ఇదో పెద్ద సమస్యగా మారింది. దీనికి చరమగీతం పాడేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. బహిరంగంగా ఉమ్మివేతలను నివారించేందుకు చిన్నపాటి పౌచ్‌లను విక్రయించే వెండింగ్‌ మెషీన్లు, కియోస్క్‌లను పశ్చిమ, ఉత్తర, సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని 42 స్టేషన్లలో ఏర్పాటు చేస్తోంది. ఒక్కో పౌచ్‌ ధర రూ.5 నుంచి రూ.10గా ఉంటుంది.

ఆయా రైల్వే స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేసేందుకు స్టార్టప్‌ కంపెనీ ఈజీస్పిట్‌తో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పౌచ్‌లను పాకెట్లో పెట్టుకోవచ్చు. అవసరమొచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఆ పౌచ్‌ల్లో వినియోగించినప్పుడు అందులోని బ్యాక్టీరియా బయటకు రాకుండా మ్యాక్రోమాలిక్యులర్‌ పల్ప్‌ టెక్నాలజీని వాడారు. ఉమ్మిని అందులో వేసినప్పుడు పౌచ్‌ దాన్ని పీల్చుకుని ఘన పదార్థంగా మారుతుంది. వాడిన తర్వాత బయటపడేసిన పౌచ్‌ నుంచి మొక్కలు పెరుగుతాయి. 15, 20 సార్లు వినియోగించేలా వేర్వేరు సైజుల్లో ఈ పౌచులు లభ్యమవుతాయి.

నాగ్‌పూర్‌కు చెందిన ఈజీస్పిట్‌ కంపెనీ ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లలో వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల అటు రైల్వేకి, ఇటు ప్రయాణికులకు మేలు చేకూరుతుందని రైల్వే శాఖ పేర్కొంది. అందుకే ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో నాన్‌ ఫేర్‌ రెవెన్యూ స్కీమ్‌కింద ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. రైళ్లలో ఉమ్మివేతల నివారణకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. పౌచ్‌లతో పాటు, గ్లాసులను, పెద్ద పెద్ద డస్ట్‌బిన్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు ఈజీ స్పిట్‌ సహ వ్యవస్థాపకులు రీతూ మల్హోత్రా తెలిపారు. ఏడాది పాటు రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని