Farm Laws: తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లు.. ట్రాక్టర్‌ ర్యాలీపై రైతులు వెనక్కి 

రైతుల ఆందోళనలతో నూతన సాగు చట్టాలపై ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజే చట్టాల రద్దుకు బిల్లు తీసుకురానుంది.

Published : 27 Nov 2021 17:26 IST

దిల్లీ: రైతుల ఆందోళనలతో నూతన సాగు చట్టాలపై ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజే చట్టాల రద్దుకు బిల్లు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో రైతులు తమ ‘చలో పార్లమెంట్‌’ ర్యాలీపై వెనక్కి తగ్గారు. చట్టాల రద్దుపై సోమవారం(నవంబరు 29) బిల్లు తీసుకురానున్న దృష్ట్యా ట్రాక్టర్‌ మార్చ్‌ను ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా శనివారం వెల్లడించింది.  

సంయుక్త కిసాన్‌ మోర్చా నేత దర్శన్‌ పాల్‌ నేడు మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం నుంచి చేపట్టాలనుకున్న చలో పార్లమెంట్‌ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. అయితే ఉద్యమాన్ని ఇప్పుడే ఆపబోం. రైతు సమస్యలపై ప్రధాని మోదీకి లేఖ రాశాం. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కేసులు వెనక్కి తీసుకోవాలి. లఖింపుర్‌ ఖేరీ ఘటనకు బాధ్యులైన కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను సస్పెండ్‌ చేయాలి. కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వాలి. ఈ అంశాలను లేఖలో ప్రస్తావించాం. వీటిపై ప్రభుత్వస్పందన కోసం ఎదురుచూస్తున్నాం. అప్పటిదాకా ఉద్యమం కొనసాగుతుంది. డిసెంబరు 4న మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’’ అని పాల్‌ వెల్లడించారు. 

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చట్టాలను రద్దు చేయకపోతే ‘చలో పార్లమెంట్‌’ పేరుతో ఆందోళన చేపడతామని గతంలో సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. శీతాకాల సమావేశాలు జరిగే ప్రతిరోజు పార్లమెంట్‌ వరకు 500 మంది రైతులతో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే రైతుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు గతవారం ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. నవంబరు 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో తొలి రోజే రద్దుకు సంబంధించిన బిల్లును తీసుకొస్తామని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రైతులు వెంటనే తమ ఉద్యమాన్ని విరమించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ట్రాక్టర్‌ ర్యాలీను అన్నదాతలు ఉపసంహరించుకున్నారు. అయితే చట్టాల రద్దుతో పాటు ఇతర డిమాండ్లు తీరేదాకా ఉద్యమం ఆగేది లేదని రైతు నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని