Lakhimpur Kheri: నిందితులను అరెస్టు చేయలేదేం? యూపీ సర్కారుపై సుప్రీం సీరియస్‌

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రంకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం చేపట్టిన

Updated : 08 Oct 2021 20:15 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రంకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై న్యాయస్థానం ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహించింది. దీనిపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. 

లఖింపుర్‌ ఖేరి ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాశారు. వీటిపై నిన్న విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. లఖింపుర్‌ ఘటనపై తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయీ నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు యూపీ సర్కారు నేడు ఆ నివేదికను సమర్పించింది. 

అయితే ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు?అని ప్రశ్నించింది. దేశంలో జరుగుతున్న ఇతర హత్య కేసుల్లో నిందితులపై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటారా? అని ఆగ్రహించింది. యూపీ ప్రభుత్వం చర్యలు కేవలం మాటల్లోనే అని, దీని ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని నిలదీసింది. సిట్‌లో ఉన్నవారంతా స్థానిక అధికారులే అని, అలాంటప్పుడు కేసు పురోగతి ఎలా ఉంటుందో అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చేతులు ముడుచుకు కూర్చుంటామంటే కుదరదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. 

సునిశిత పరిస్థితి దృష్ట్యా ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదని, దీనిపై అక్టోబరు 20న తదుపరి విచారణ చేడతామని ధర్మాసనం వెల్లడించింది. మరో దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిపించాలా లేదా అన్నదానిపై కూడా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అప్పటిదాకా ఈ ఘటనలో సాక్ష్యాలను భద్రంగా ఉంచాలని.. యూపీ డీజీపీకి తమ మాటగా చెప్పాలని ఆ రాష్ట్రం తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్ సాల్వేకు సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని