Published : 28/02/2021 16:28 IST

న్యూయార్క్‌ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!

ఖండించిన ఆండ్రూ క్యూమో, విచారణకు ఆదేశం

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ గవర్నర్‌పై వస్తోన్న లైంగిక వేధింపుల ఆరోపణలు డెమొక్రాటిక్‌ నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. తనపై గవర్నర్‌ అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గవర్నర్‌ కార్యాలయ మాజీ సిబ్బందిలో ఒకరు ఈ మధ్యే ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే గవర్నర్‌ కార్యాలయంలో పనిచేసిన మరో మహిళ తాజాగా ఇటువంటి ఆరోపణలతో ముందుకొచ్చింది. అయితే, వరుస ఆరోపణలను ఖండించిన గవర్నర్‌ కార్యాలయం, పూర్తి విచారణ కోసం స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.

ఛార్లొటే బెన్నెట్‌(25) అనే యువతి గత నవంబరు వరకు న్యూయార్క్‌ గవర్నర్‌ కార్యాలయంలో ఆరోగ్య విధాన సలహాదారుగా పనిచేసింది. అక్కడ పనిచేస్తోన్న సమయంలోనే న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తనను లైంగికంగా వేధించారని ఛార్లొటే బెన్నెట్‌ తాజాగా ఆరోపించింది. గత ఏడాది జూన్‌ నెలలో కార్యాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో తనతో ఆండ్రూ క్యూమో అమర్యాదకరంగా సంభాషించారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే, గవర్నర్‌ నేరుగా తనని తాకలేదని, ఆయనతో సంభాషించిన సమయంలో ఆయన మాటలు దురుద్దేశంతో కూడుకున్నట్లు స్పష్టమయ్యిందని వెల్లడించింది. గవర్నర్‌ తనతో గడపాలని ఆయన మాటల్లో వ్యక్తం కావడం తనకు ఎంతో అసౌకర్యంగా, భయంకరంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ ఘటన జరిగిన వారం రోజుల్లోనే గవర్నర్‌ కార్యాలయ ఉన్నతాధికారులతో మాట్లాడి వేరే విభాగానికి మారినట్లు బెన్నెట్‌ మీడియాతో పేర్కొంది. ప్రస్తుతం అక్కడ సౌకర్యంగానే ఉన్నానని, అందుకే ఇదివరకు జరిగిన ఘటనపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదని వెల్లడించింది.

ఇక గవర్నర్‌ కార్యాలయంలో ఆర్థికాభివృద్ధి విభాగంలో పనిచేసిన మాజీ సలహాదారు(35) కూడా గవర్నర్‌ క్యూమోపై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తనను గవర్నర్‌ అవాంఛనీయంగా ముద్దు పెట్టుకోవడమే కాకుండా అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు ఆ మహిళ మూడురోజుల క్రితమే ఆరోపించింది. 2015-18 మధ్యకాలంలో గవర్నర్‌ కార్యాలయంలో పనిచేసినప్పుడు తాను వేధింపులు ఎదుర్కొన్నట్లు సదురు మహిళ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను కొట్టిపారేసిన గవర్నర్‌ కార్యాలయం, ఆమె చెబుతున్నదంతా అబద్ధమని ప్రకటించింది.

ఖండించిన గవర్నర్‌ కార్యాలయం..

ఆండ్రూ క్యూమోపై వచ్చిన లైంగిక ఆరోపణలు పూర్తిగా అసత్యమని న్యూయార్క్‌ గవర్నర్‌ కార్యాలయం ప్రకటించింది. ఆరోపణలు చేసిన యువతితో గవర్నర్‌ ఎప్పుడూ అమర్యాదగా మాట్లాడలేదని స్పష్టంచేసింది. ‘కరోనా సమయంలో మా బృందంలో బెన్నెట్‌ ఎంతో కష్టపడి పనిచేంది. ఆ అమ్మాయితో దురుద్దేశంగా ప్రవర్తించలేదు, అలాంటి ఆలోచన కూడా కలుగలేదు. అయినప్పటికీ ఆమెకు బహిరంగంగా మాట్లాడే పూర్తి స్వేచ్ఛ తనకు ఉంది. ’అని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోపణల నేపథ్యంలో వీటిపై పూర్తి విచారణ జరిపేందుకు మాజీ ఫెడరల్‌ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే, డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన ఆండ్రూ క్యూమో, గత దశాబ్దకాలంగా న్యూయార్క్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన మూడోసారి గవర్నర్‌గా ఎన్నికకాగా, 2022లో ఆయన పదవీకాలం ముగుస్తుంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్