Assam: పోలీసుస్టేషన్‌కు నిప్పు.. బుల్డోజర్లతో నిందితుల ఇళ్ల కూల్చివేత

అస్సాం నగావ్​ జిల్లాలో పోలీస్​స్టేషన్​కు నిప్పంటించిన నిందితుల ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు........

Updated : 23 May 2022 10:47 IST

గువాహటి : అస్సాంలోని నగావ్​ జిల్లాలో పోలీస్​స్టేషన్​కు నిప్పంటించిన ఘటనలో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కారకులైన ఐదు కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. కేసుకు సంబంధించి 23 మందిని అదుపులోకి తీసుకున్నామని డీఐజీ సత్యరాజ్​ హజారికా తెలిపారు. నిందితుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు సజావుగా సాగుతోందని, బటద్రవా స్టేషన్​ ఇంఛార్జ్​ను సైతం సస్పెండ్​ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. పోలీస్​స్టేషన్​కు నిప్పంటించడం లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మృతుడి బంధువుల్లో పలువురికి క్రిమినల్​ రికార్డులు ఉన్నాయని తెలిపారు.

అసోం నగావ్​ జిల్లాలోని బటద్రవా పోలీస్​స్టేషన్‌కు గుర్తుతెలియని దుండగులు శనివారం నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. సలోనిబరి ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారి సఫీకుల్‌ ఇస్లాం  శుక్రవారం రాత్రి వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి వెళుతుండగా.. బటద్రవా పోలీసులు అడ్డుకొని అతడి నుంచి రూ. 10వేలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వకపోవడంతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి..  కుటుంబ సభ్యుల ముందే కొట్టినట్లు స్థానికులు ఆరోపించారు.

సఫీకుల్‌ కుటుంబసభ్యులు తిరిగి రూ.10వేలతో పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. అప్పటికే అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన సఫీకుల్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించి నిప్పంటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని