US: అమెరికాలో ఘోరం.. క్రిస్మస్‌ పరేడ్‌పైకి దూసుకెళ్లిన కారు

అగ్రరాజ్యం అమెరికాలోని విస్కన్‌సన్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్‌ పరేడ్‌పైకి ఓ ఎస్‌యూవీ వేగంగా దూసుకెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం.

Updated : 22 Nov 2021 12:32 IST

ఐదుగురు మృతి.. 40 మందికి పైగా గాయాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలోని విస్కన్‌సిన్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్‌ పరేడ్‌పైకి ఓ ఎస్‌యూవీ వేగంగా దూసుకెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్‌ పండగను పురస్కరించుకుని మిల్‌వాకీ శివారులోని వాకీషా టౌన్‌లో ఆదివారం సాయంత్రం సంప్రదాయ వార్షిక పరేడ్‌ను నిర్వహించారు. వందలాది మంది ఉల్లాసంగా పాటలు పాడుతూ ర్యాలీగా వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఓ ఎస్‌యూవీ బారికేడ్లను ఢీకొట్టి మనుషులపై నుంచి దూసుకెళ్లింది. 

అక్కడే ఉన్న పోలీసు అధికారి కారుపై కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్‌ ఆగకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఊహించని పరిణామంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే మరణాలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరో 40మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. 

పరేడ్‌పైకి కారు దూసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనకు కారణమైన ఎస్‌యూవీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి ఉగ్రకోణం లేదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని