Sputnik V: పంపిణీ షురూ..ధర ఎంతంటే!

Dr. Reddy`s: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.

Updated : 14 May 2021 13:38 IST

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటించింది. స్పుత్నిక్‌ వీ ఒక్కో డోసు ధర రూ.948గా నిర్ణయించింది.  దీనికి 5శాతం జీఎస్‌టీ కలిపితే టీకా ధర డోసుకు రూ.995.40. 

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వీ టీకా వినియోగానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రష్యా నుంచి తొలి విడతలో దాదాపు 1.5లక్షల డోసులు మే 1వ తేదీన హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌కు చేరాయి. వీటి పంపిణీకి సెంట్రల్‌ డ్రగ్స్‌ లాబోరేటరీ నుంచి మే 13న అనుమతి వచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్ వెల్లడించింది. దీంతో తొలి డోసును నేడు (మే 14న) ప్రారంభించామని హైదరాబాద్‌లోని ఆ సంస్థ తెలిపింది.

భారత్‌లో స్పుత్నిక్‌ వీ ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత దాదాపు 10కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌ పంపిణీ చేయనుంది. అయితే, స్థానికంగా ఉత్పత్తి మాత్రం జులై నెల నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌లను రష్యా నుంచే నేరుగా దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత ధర రూ.948గా(5శాతం జీఎస్‌టీ మినహా) నిర్ణయించినప్పటికీ స్థానికంగా పంపిణీ పెరిగిన అనంతరం వ్యాక్సిన్‌ ధర తగ్గే అవకాశం ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.

‘దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి  కొనసాగుతున్న వేళ..  వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌ అత్యంత ప్రభావవంతమైన సాధనం. ఈ సందర్భంలో భారత్‌లో చేపట్టిన అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు తోడ్పాటును అందించడమే మా అతిపెద్ద ప్రాధాన్యత’అని డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఇక రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ 91శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు క్లినికల్‌ ప్రయోగాల్లో తేలింది.  ఈ వ్యాక్సిన్‌ను మూడు వారాల వ్యవధిలో రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని