తపోవన్‌లో నిలిచిపోయిన సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో రిషిగంగ ఉప్పొంగింది. ఈ నది నీటి మట్టం పెరగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తపోవన్‌ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్నవారి కోసం.....

Updated : 11 Feb 2021 15:51 IST

తపోవన్‌: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో రిషి గంగ నది నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తపోవన్‌ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్నవారి కోసం నాలుగు రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్ని  తాత్కాలికంగా నిలిపివేసినట్టు జిల్లా మెజిస్ట్రేట్‌ స్వాతి ఎస్‌ బదౌరియా వెల్లడించారు. సొరంగం లోపల పనిలో ఉన్న భద్రతా సిబ్బందితో పాటు అక్కడ డ్రిల్లింగ్‌ చేసేందుకు ఉంచిన భారీ యంత్రాలను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తపోవన్‌ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ టన్నెల్‌లో చిక్కుకున్న 25 నుంచి 35మంది కోసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. లోపల ఉన్నవారిని ఎలాగైనా రక్షించాలన్న లక్ష్యంతో పూడుకుపోయిన మట్టికే రంధ్రాలు చేసి ప్రాణవాయువు పంపించాలని కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి నదిలో నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, నీటిమట్టం పెరగడంతో  చమోలి ఎస్పీ యశ్వంత్‌ సింగ్‌ చౌహాన్‌ నదీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. 

ఆదివారం రోజున ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైనవారిలో 34 మంది మృతదేహాలు దొరికాయి. అందులో 29 మందిని గుర్తించారు. వీరిలో పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు అతి కష్టం మీద ఇళ్లకు చేరుకున్నారు. దాంతో ఇంకా జాడ తెలియని వారి సంఖ్య 172గా ఉంది. సమయం గడిచేకొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆశలు సన్నగిల్లుతుండడంతో మరింత ఆందోళన నెలకొంది.  మరోవైపు, 1500 మీటర్ల పొడవు గల సొరంగంలో ఇంతవరకు 120 మీటర్ల మేర పూడికను తీయగలిగారు. అయినా ఇంకా నీరు, బురద కొట్టుకొని వస్తుండడంతో సహాయ చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. కొన్ని చోట్ల మట్టి గట్టిపడడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు దళానికి చెందిన 450 మందితో పాటు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, సైనికులు మొత్తం 600కుపైగా జవాన్లు సమన్వయంతో పనిచేస్తున్నారు. గల్లంతైన వారి జాడ కనిపెట్టేందుకు డ్రోన్‌ కెమెరాలు, రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి..
ఉత్తరాఖండ్‌లో జలప్రళయ.. ఫొటో గ్యాలరీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని