Afghanistan: మా డబ్బులు మాకివ్వండి: తాలిబన్‌ సర్కార్‌

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతోంది. కఠిన ఆంక్షల మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు ఆహారం.. నగదు నిల్వలు లేక దేశం ఆహార, ఆర్థిక సంక్షోభంలో పడింది. ముఖ్యంగా అఫ్గాన్‌ మార్కెట్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. ఉద్యోగులకు జీతాలు

Published : 30 Oct 2021 01:03 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతోంది. కఠిన ఆంక్షల మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు ఆహారం, నగదు నిల్వలు లేక దేశం ఆహార, ఆర్థిక సంక్షోభంలో పడింది. ముఖ్యంగా అఫ్గాన్‌ ఖజానాలో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్ల ప్రభుత్వం బ్యాంకులను కోరుతోంది.

అఫ్గానిస్థాన్‌ గత ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంకు సహా యూరప్‌లోని అనేక సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచింది. అయితే, ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆ డబ్బును తాలిబన్లు ఉపసంహరించుకోకుండా నిలుపుదల చేశాయి. దీంతో ఇప్పుడు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని తాలిబన్‌ ప్రభుత్వం అభ్యర్థిస్తోంది.

‘‘ఆ డబ్బంతా అఫ్గానిస్థాన్‌ దేశానిది. కాబట్టి మా డబ్బు మాకివ్వండి. నగదు నిల్వలను నిలుపుదల చేయడం అధర్మం, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం’’ అని అఫ్గాన్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం మహిళలకు విద్య సహా మానవ హక్కులను గౌరవిస్తుందని, మానవత్వంతో చేసే పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు.

డబ్బు విడుదల చేయకపోతే యూరప్‌కే నష్టం

అఫ్గాన్‌లో నగదు నిల్వలు తగ్గిపోతుండటంతో పరిస్థితులు చేజారే అవకాశముందని అఫ్గాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ బోర్డు సభ్యుడు షా మెహరబీ తెలిపారు. ‘అఫ్గాన్‌లో ఈ ఆర్థిక సంక్షోభాన్ని నిలువరించాలంటే నెలకు 150 మిలియన్‌ డాలర్లు అవసరం. ఈ ఏడాది చివరి వరకు అయితే సంక్షోభాన్ని నిలువరించగలం. ఇదే పరిస్థితి కొనసాగితే యూరప్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. అఫ్గాన్‌కు వివిధ బ్యాంకుల్లో ఉన్న డబ్బును వినియోగించే అవకాశం ఇవ్వకపోతే అఫ్గాన్‌ ప్రజలు యూరప్‌కే వలస వెళ్తారు’’అని మెహరబీ చెప్పారు. 

సింహభాగం అమెరికా వద్దే..

అమెరికాలోని బ్యాంకుల్లో అఫ్గాన్‌కు చెందిన దాదాపు 9 బిలియన్‌ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. కానీ.. వాటిని విడుదల చేసేది లేదని యూఎస్‌ ప్రభుత్వం తెగేసి చెప్పింది. జర్మనీలోని కామర్జ్‌బ్యాంక్‌ వద్ద 431 మిలియన్‌ డాలర్లు, జర్మనీ సెంట్రల్‌ బ్యాంక్‌లో దాదాపు 94 మిలియన్‌ డాలర్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో దాదాపు 660 మిలియన్‌ డాలర్లు ఉన్నాయి. ‘‘ఈ నగదు నిల్వలను విడుదల చేయకపోతే అఫ్గాన్‌లో దిగుమతులు తగ్గిపోతాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ కూలిపోతుంది. దుకాణాలు ఖాళీ అవుతాయి. ఆహారం మరింత ప్రియం అవుతుంది’’ అని మెహరబీ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని