Modi: ఎందుకంత సీరియస్‌గా మాట్లాడుతున్నావని ప్రధాని అడగ్గా.. చిన్నారి ఏం చెప్పిందంటే..?

క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం, వినూత్న ఆవిష్కరణ తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచే 5 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కేంద్రం పురస్కారాలు అందచేస్తోంది.

Published : 25 Jan 2022 20:07 IST

దిల్లీ: క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం, వినూత్న ఆవిష్కరణ తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచే 5 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కేంద్రం పురస్కారాలు అందచేస్తోంది. ఈ సారి ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’ అందుకున్న బుడతలతో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. వారి ఆలోచనలు, ఆశయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో చండీగఢ్‌కు చెందిన బాలిక తారుషి గౌర్ ప్రధాని అడిగిన ప్రశ్నలకు చురుగ్గా సమాధానాలు చెప్పింది. తైక్వాండోలో డిగ్రీ వన్‌, డిగ్రీ టు బ్లాక్‌ బెల్ట్‌లు పొందిన చిన్నవయస్సురాలు అయిన ఆ పాప మాటలకు ప్రధాని చిరునవ్వు చిందించారు. 

చదువు, ఆటలు ప్రాముఖ్యత గురించి ప్రధాని అడిగిన ప్రశ్నకు.. ‘దేశంగా గర్వపడేలా చిన్నారులు ఎదగడంలో పని, ఆటలు రెండూ ముఖ్యమైనవే’ అంటూ తారుషి చటుక్కున సమాధానం ఇచ్చి ఆకట్టుకుంది. అలాగే తనకు ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ఎందుకు ఆదర్శమో కూడా వివరించింది. ‘మేరీకోమ్‌ క్రీడలు, జీవితం పట్ల సమతుల్యత పాటిస్తారు. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకెళ్లేలా స్ఫూర్తినింపుతారు. ఆమె గొప్ప క్రీడాకారిణి. అలాగే మంచి తల్లి, భార్య.. ’ అంటూ చెప్పుకుంటూపోయింది. 

ఆమె మాటలు విన్న మోదీ.. ఎందుకు ఇంత సీరియస్ విషయాలు ముచ్చటిస్తున్నావని అడిగారు. ‘సర్ నేను సీరియస్ విషయాలు మాట్లాడటం లేదు. నేను దేశం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. దాని కోసం క్రమశిక్షణతో ఉండాలనుకుంటున్నాను’ అంటూ ఏ మాత్రం తడుముకోకుండా సమాధానమివ్వడంతో ప్రధాని ముగ్ధుడయ్యారు. అలాగే తమ ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహించడంలో, క్రీడాకారులు లక్ష్యాలను చేరుకోవడంలో ఎలా సహకరించిందో ఈ సందర్భంగా అక్కడున్న చిన్నారులకు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని