Vaccine for Children: చిన్నారులకు టీకా.. త్వరలోనే జైడస్‌ క్యాడిలా అందుబాటులోకి!

దేశంలో మరికొన్ని రోజుల్లోనే 18ఏళ్లలోపు పిల్లలకు టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి పేర్కొంది.

Published : 17 Oct 2021 21:49 IST

కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే పాల్‌

దిల్లీ: దేశంలో మరికొన్ని రోజుల్లోనే 18ఏళ్లలోపు పిల్లలకు టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి పేర్కొంది. అయితే, శాస్త్రీయ హేతుబద్ధత, టీకాల లభ్యత, సరఫరా పరిస్థితుల ఆధారంగా పిల్లలకు వ్యాక్సిన్లను ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక దేశంలో కొవిడ్‌ తీవ్రత కాస్త అదుపులోనే ఉందన్న ప్రభుత్వం.. మహమ్మారి ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదని మారోసారి హెచ్చరించింది.

చిన్నారులు, యుక్తవయసు పిల్లల కోసం కొవిడ్‌ వ్యాక్సిన్‌లను పలు దేశాలు అందుబాటులోకి తెచ్చాయి. వ్యాక్సిన్‌లపై శాస్త్రీయ హేతుబద్ధత, వాటి లభ్యత, సరఫరా పరిస్థితుల ఆధారంగానే వాటిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే పాల్‌ వెల్లడించారు. ‘12 నుంచి 18ఏళ్ల యుక్తవయసు పిల్లలకోసం జైడస్‌ క్యాడిలా టీకా (ZyCov-D) వినియోగానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, దీనిని అత్యంత మెరుగైన విధానంలో ఎలా అందించాలనే విషయంపై టీకా పంపిణీపై ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా బృందం ఆలోచిస్తోంది. చిన్నారులకు వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే సమయాన్ని కచ్చితంగా చెప్పనప్పటికీ.. జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శిక్షణ కూడా కొనసాగుతోంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుంది’ అని వీకే పాల్‌ పేర్కొన్నారు.

సెకండ్‌ వేవ్‌ తగ్గినా.. ముప్పు తొలగిపోలేదు..

దేశంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతోంది, సెకండ్‌ వేవ్‌ ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ వైరస్‌ ముప్పు తొలగిపోయిందని చెప్పడం సరైనది కాదని వీకే పాల్‌ పేర్కొన్నారు. ఇతర దేశాల్లో రెండు వేవ్‌ల తర్వాత మరిన్ని వేవ్‌ల రూపంలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో పండగల సీజన్‌ నడుస్తోందని.. ఈ కీలక సమయంలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ మరోసారి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇతర దేశాల్లో వ్యాక్సిన్‌ను భారీస్థాయిలో అందించినప్పటికీ వైరస్‌ విస్తృతి పెరుగుతూనే ఉందన్నారు.

చిన్నారుల్లో లక్షణాలు తక్కువే..

చిన్నారులకు కొవిడ్‌ వ్యాప్తి చెందడంతో పాటు ఇతరులకు వైరస్‌ సంక్రమణనకు పిల్లలు కారణమవుతారు. అయినప్పటికీ చిన్నారుల్లో కొవిడ్‌ లక్షణాలు మాత్రం తక్కువగానే ఉంటాయి. అందుకే సరిపడా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చిన వెంటనే వారికి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెడుతామని వీకే పాల్‌ పేర్కొన్నారు. ఇక 2 నుంచి 18ఏళ్ల పిల్లలకోసం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ దీనికి డీసీజీఐ అనుమతి ఇస్తే దేశంలో చిన్నారుల కోసం అందుబాటులోకి వచ్చే రెండో వ్యాక్సిన్‌గా కొవాగ్జిన్‌ నిలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని