Mini China in Pakistan: పాకిస్థాన్‌లో 50లక్షల మంది చైనీయులు..!

వచ్చే నాలుగేళ్లలో (2025నాటికి) పాకిస్థాన్‌లో దాదాపు 50లక్షల మంది చైనీయులు పనిచేసే అవకాశం ఉందని పాక్‌ ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 22 Sep 2021 19:30 IST

వచ్చే నాలుగేళ్లలో పెరగనున్నట్లు పాక్‌ నిపుణుల అంచనా

ఇస్లామాబాద్‌: గత కొంతకాలంగా పాకిస్థాన్‌లో చైనీయుల జనాభా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్లలో (2025నాటికి) పాకిస్థాన్‌లో దాదాపు 50లక్షల మంది చైనీయులు పనిచేసే అవకాశం ఉందని పాక్‌ ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్‌లో పనిచేసే చైనీయుల ఆరోగ్య అవసరాలను తీర్చడమే కాకుండా చైనా వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు డ్రాగన్‌ దేశంతో సన్నిహిత సంబంధాలు దోహదం చేస్తాయని పాకిస్థాన్‌ ప్రజారోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హెల్త్‌ కారిడార్‌పై చైనా కన్ను..?

పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చైనా భారీ పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (CPEC) కింద భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. రానున్న రోజుల్లోనూ వీటిని మరింత పెంచేందుకు ప్రయత్నాలను చేస్తుండగా.. అక్కడి ఆరోగ్య రంగంలోనూ తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు చైనా సన్నాహాలు చేస్తున్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో చైనా పాకిస్థాన్‌ హెల్త్‌ కారిడార్‌ (CPHC) కింద చైనా మెడికల్‌ యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలతో పాటు బయోటెక్నాలజీ సంస్థలు పాకిస్థాన్‌ సంస్థల మధ్య సహకారాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా ఆరోగ్య అవసరాలను తీర్చవచ్చని పాకిస్థాన్‌ ప్రజారోగ్య నిపుణులు భావిస్తున్నారు.

ఒప్పందాలకు సిద్ధం..

హెల్త్‌ కారిడార్‌కు సంబంధించి చైనా సంస్థలతో సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు పాకిస్థాన్‌ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్‌ 23-24 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరుగనున్న 11 వార్షిక ప్రజారోగ్య సమావేశాల్లో పాకిస్థాన్‌-చైనా సంస్థల మధ్య చాలా ఒప్పందాలు (MoU) కుదుర్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఇందులో తొలి అడుగుగా వుహాన్‌ యూనివర్సిటీలోని ప్రజారోగ్య విభాగంతో చైనా-పాకిస్థాన్ మధ్య పలు ఒప్పందాలు జరుగుతాయని చైనా-పాకిస్థాన్‌ హెల్త్‌ కారిడార్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ లీ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌తోపాటు అఫ్గానిస్థాన్‌, సెంట్రల్‌ ఆసియా దేశాల్లో లక్షల మంది చైనీయులు పనిచేస్తున్నారు. వీరి ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కావాలి. ఇందుకోసం నూతన వైద్య సాంకేతికతతో పాటు సంప్రదాయ చైనా మందులపై పాకిస్థాన్‌ నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అకాడమీ (HSA) వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ షహజాద్‌ అలీఖాన్‌ పేర్కొన్నారు. కేవలం చైనా నుంచి వచ్చే వారి ఆరోగ్య అవసరాలను తీర్చడమే కాకుండా ప్రత్యామ్నాయ చికిత్స కోసం చూస్తోన్న పాకిస్థాన్‌ ప్రజలకు ఈ నిపుణులు ఎంతగానో దోహదపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే, పాకిస్థాన్‌లో మరింత పాతుకుపోయేందుకే హెల్త్‌ కారిడార్‌ పేరుతో బీజింగ్‌ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని