Artificial intelligence: ఊపిరితిత్తుల క్యాన్సర్లను గుర్తించే కృత్రిమ మేధ

ఊపిరితిత్తుల క్యాన్సర్లను 90 శాతానికి పైగా కచ్చితత్వంతో గుర్తించే ఒక కృత్రిమ మేధ (ఏఐ) విధానాన్ని అమెరికా

Published : 22 Aug 2021 12:20 IST

వాషింగ్టన్‌: ఊపిరితిత్తుల క్యాన్సర్లను 90 శాతానికి పైగా కచ్చితత్వంతో గుర్తించే ఒక కృత్రిమ మేధ (ఏఐ) విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దాదాపు 800 మందిపై జరిపిన పరిశోధనలో ఇది తన సత్తాను చాటింది. క్యాన్సర్‌ మరణాలకు ప్రధాన కారణం ఊపిరితిత్తుల క్యాన్సరే. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందికిపైగా బలవుతున్నారు. ఈ వ్యాధిని గుర్తించేందుకు వాడే ‘లో డోస్‌ కంప్యూటెడ్‌ టొమోగ్రఫీ స్క్రీనింగ్‌’ పరీక్షను ఎక్కువ మంది చేయించుకోవడంలేదు. తప్పుడు ఫలితాల వల్ల ఇబ్బందులు, పరీక్షతో వెలువడే రేడియోధార్మికత వంటివి ఇందుకు ప్రతిబంధకాలవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అందువల్ల మెరుగైన ప్రత్యామ్నాయ స్క్రీనింగ్‌ విధానాలు అవసరమయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము ‘డీఎన్‌ఏ ఎవాల్యుయేషన్‌ ఆఫ్‌ ఫ్రాగ్మెంట్స్‌ ఫర్‌ ఎర్లీ ఇంటర్‌సెప్షన్‌’ (డెల్ఫీ) అనే విధానాన్ని అభివృద్ధి చేసినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ కిమెల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఏఐతో పనిచేస్తుందన్నారు. బాధితుల రక్త నమూనాల్లో.. క్యాన్సర్‌ కణాల నుంచి వెలువడే డీఎన్‌ఏ అవశేషాల్లోని నిర్దిష్ట పోకడలను ఇది గుర్తిస్తుందన్నారు. తద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను పసిగడుతుందని చెప్పారు. ప్రొటీన్‌ బయోమార్కర్‌ ఆధారిత విధానం, కంప్యూటెడ్‌ టొమోగ్రఫీలతో కలిపి ఉపయోగించినప్పుడు ఇది ఒకటి, రెండు దశల క్యాన్సర్‌ను 91 శాతం; మూడు, నాలుగు దశలను 96 శాతం కచ్చితత్వంతో కనుగొందని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని