China: ఆ ప్రాంతాల నుంచి బీజింగ్‌కు రాకపోకలు నిలిపివేత

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు చైనా ఆదివారం పలు

Published : 09 Aug 2021 09:59 IST

చైనాలో కొవిడ్‌ కట్టడి చర్యలు

బీజింగ్‌: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు చైనా ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ముప్పు మధ్యస్థంగా లేదా తీవ్రంగా ఉన్న ప్రావిన్సుల నుంచి రాజధాని బీజింగ్‌కు రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ఆయా ప్రాంతాల నుంచి రాజధానికి రైలు, విమాన టికెట్ల కొనుగోలు చేయకుండా కూడా నిషేధం విధించింది. ఒకవేళ ఇతర వాహనాల్లో ఎవరైనా వెళ్లేందుకు ప్రయత్నించినా వారిని వెనక్కి పంపించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. ఈమేరకు మధ్యస్థ, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల వారికి ప్రత్యేకంగా పసుపు రంగుతో కూడిన హెల్త్‌ కోడ్‌లు ఇస్తారు. వైరస్‌ వ్యాప్తి తగ్గితే అప్పుడు కోడ్‌ మారుస్తారు.

ఆ ప్రాంతాల్లో ముప్పు తగ్గి ఆకుపచ్చ కోడ్‌ ఇచ్చేంతవరకు రాజధానికి రాకపోకలపై నిషేధం అమల్లో ఉంటుంది. కోడ్‌ మారిన తర్వాత స్థానికులకు లేదా ఆయా ప్రాంతాలకు 14 రోజులుగా వెళ్లనివారికి మాత్రమే బీజింగ్‌కు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఆకుపచ్చ కోడ్‌కు మారిన తర్వాత కూడా అక్కడి ప్రజలు 48 గంటల్లో చేయించుకున్న న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్ట్‌ ‘నెగెటివ్‌’ ఫలితాన్ని చూపించాల్సి ఉంటుంది. చైనాలో కరోనా వైరస్‌ తొలిసారి బయటపడిన వుహాన్‌తో పాటు నాన్‌జింగ్, యాంగ్‌ఝౌ, ఝాంగ్‌జియాజీ, వెన్‌వూ వంటి 15 నగరాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. వీటి నుంచి రాకపోకలను నిలిపివేశారు. చైనాలోని జియాంగ్‌సు, హెనన్, యున్నన్, హుబేయ్, హునన్‌ సహా పలు ప్రావిన్సుల్లో శనివారం 150 కేసులు బయటపడ్డాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని