Congress: పంజాబ్‌ పరిస్థితి మాకు రాదు.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ సీఎంల ధీమా

పంజాబ్‌లో కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు, నాయకత్వ మార్పు క్రమంలోనే... ఆ పార్టీ అధికారంలో

Updated : 03 Oct 2021 11:39 IST

జైపుర్, రాయ్‌పుర్‌: పంజాబ్‌లో కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు, నాయకత్వ మార్పు క్రమంలోనే... ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం స్పందించారు. రాజస్థాన్‌లో తాము ఐదేళ్ల పాలన పూర్తిచేసుకుంటామని సీఎం అశోక్‌ గహ్లోత్‌ ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్‌ పరిస్థితి తమకు రాదని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ పేర్కొన్నారు. 
పంజాబ్‌లో పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడం, అమరీందర్‌సింగ్‌ సీఎం పదవికి, పార్టీకి రాజీనామా చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో గహ్లోత్‌ శనివారం తన నివాసం వద్ద మాట్లాడారు. ‘‘రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ సర్కారు ఐదేళ్ల పాలన పూర్తిచేసుకోవడమే కాదు... తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. నివేదికలు ఇదే చెబుతున్నాయి. మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ల మధ్య నాయకత్వ పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

దిల్లీలో బఘేల్‌ అనుచరులు!

ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్‌ బఘేల్‌ రెండున్నరేళ్లు సీఎం పదవిలో కొనసాగారు. ముందస్తు ఒప్పందం ప్రకారం, ఇప్పుడు ఆ పదవి తనకు ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి టి.ఎస్‌.సింగ్‌దేవ్‌ పట్టుబడుతున్నారు. పంజాబ్‌ పరిణామాల నేపథ్యంలో బఘేల్‌ మాట్లాడుతూ... తమ రాష్ట్రం పంజాబ్‌ మాదిరి కాబోదని పేర్కొన్నారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌ ఎప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లానే ఉంటుంది తప్ప, పంజాబ్‌ మాత్రం కాబోదు. కాకపోతే, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఓ పోలిక మాత్రం ఉంది. వాటి పేర్లలో అంకెలు ఉన్నాయి. పంజాబ్‌లో ఐదు నదులు ఉంటే, ఛత్తీస్‌గఢ్‌లో 36 కోటలున్నాయి’’ అని ఆయన అన్నారు. సీఎం పదవిలో పూర్తికాలం కొనసాగేందుకు బఘేల్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు మద్దతు ఇస్తున్న పలువురు శాసనసభ్యులు మూడు రోజులుగా దిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే- రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్న క్రమంలో, బఘేల్‌కు మద్దతుగా పార్టీ ఛత్తీస్‌గఢ్‌ వ్యవహారాల బాధ్యుడు పీఎల్‌ పూనియాను కలిసేందుకే తాము దిల్లీ వెళ్లినట్టు కొందరు శాసనసభ్యులు చెప్పారు. ఈ పరిణామంపై బఘేల్‌ స్పందిస్తూ-‘‘ఎమ్మెల్యేల దిల్లీ పర్యటనను రాజకీయ కోణంలో చూడొద్దు. ఎక్కడికీ వెళ్లకుండా వారిపై నిషేధమేమీ లేదు. వారు మళ్లీ తిరిగి వచ్చేస్తారు’’ అని పేర్కొన్నారు. సింగ్‌దేవ్‌ కూడా ఎమ్మెల్యేల పర్యటనపై తేలికచేసి మాట్లాడారు. దీనికి అంత ప్రాధాన్యం లేదని, రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

మోదీ పాలనలో మౌనం పనికిరాదు: కపిల్‌ సిబల్‌

అహ్మదాబాద్‌: మోదీ పాలనలో మౌనంగా ఉండకూడదని, అలా ఉంటే భాజపా దుర్మార్గాల్లో పాలుపంచుకున్నట్టేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు నేపథ్యంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘‘జి-23 అసమ్మతి నేతల బృందం అంటూ కాంగ్రెస్‌లో ఏ వేదికా లేదు. ఉన్నదల్లా పార్టీలో సంస్కరణలు కోరుతున్నవారే. అందుకు పార్టీ సిద్ధమో, కాదో నాకు తెలియదు. కానీ, నా అభిప్రాయాలను మాత్రం నేను వ్యక్తం చేస్తున్నాను. రాజకీయ నిబంధనలను భాజపా మార్చేసింది. వ్యవస్థలను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. మహాత్మాగాంధీని ప్రధాని మోదీ పొగుడుతున్నారు. కానీ, ఆయన చెప్పినదానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రులను భాజపా మార్చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌నూ ఇంటికి పంపాలని చూసింది. కానీ, కుదరలేదు. భాజపా వేధింపులపై రాహుల్‌గాంధీ తన స్వరమెత్తుతున్నారు. ఇది చాలా మంచి పని’’ అని సిబల్‌ అన్నారు.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని