
ఆన్‌లైన్ గేమ్‌లు ఆడొద్దన్నారని రూ.33 లక్షలతో బాలుడు పరార్
చెన్నై(క్రైం), న్యూస్‌టుడే: ఆన్‌లైన్ గేములు ఆడవద్దని తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో.. నగదు, బంగారు నగలతో ఓ బాలుడు నేపాల్ వెళ్లిపోయేందుకు యత్నించాడు. చివరికి పోలీసులు పట్టుకొని శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నై, పాతచాకలిపేటకి చెందిన వెంకట్‌కుమార్, చెన్నై తాగునీటి బోర్డులో కాంట్రాక్టరు. అతని 15 ఏళ్ల కుమారుడు ఎక్కువగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. గమనించిన తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో మనస్తాపానికి గురైన బాలుడు వారితో మాట్లాడటం మానేశాడు. ఈ క్రమంలోనే 17వ తేదీ రాత్రి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. ఇంట్లో ఉన్న రూ.33 లక్షల నగదు, 213 సవర్ల బంగారు నగలు కూడా కనిపించలేదు. దీనిపై తల్లిదండ్రులు చాకలిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు తాంబరంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నగలను తాంబరంలో తాకట్టు పెట్టడానికి యత్నించాడని, నేపాల్ వెళ్లడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తెలిసింది.